ఇప్పటి వరకు వినూత్న నిరసనలు.. ఆందోళనలకే పరిమితమైన సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనవుతోంది. కలసి రండి.. రాజీనామాలు చేయండి.. అంటూ నేతలను ప్రాధేయపడిన ప్రజల్లో సహనం నశిస్తోంది.నిగ్గదీసి అడుగు.. సిగ్గులేని నేతలను
సాక్షి, కర్నూలు: ఇప్పటి వరకు వినూత్న నిరసనలు.. ఆందోళనలకే పరిమితమైన సమైక్యాంధ్ర ఉద్యమం ఉప్పెనవుతోంది. కలసి రండి.. రాజీనామాలు చేయండి.. అంటూ నేతలను ప్రాధేయపడిన ప్రజల్లో సహనం నశిస్తోంది. విభజనతో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి.. ఒక్కసారి ఆలోచించండని.. వేడుకున్న ఉద్యోగులు ఇక తిరుగుబాటుకు సన్నద్ధమయ్యారు. గురువారం సమైక్య సెగతో కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. తెలుగుదేశం నేతలు ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారు కాబోలు.. ప్రజల్లోకి వచ్చేందుకూ జంకుతున్నారు. పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ మాత్రం ఎప్పటిలానే ఉద్యమ పథంలో తమ వంతు భాగస్వామ్యాన్ని నెరవేరుస్తోంది.
పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వైఎస్‌ఆర్‌సీపీ పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి సతీమణి విజయ నేతృత్వంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. నగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా 48 గంటల నిరాహారదీక్ష చేపట్టిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించినడానికి వచ్చిన నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిని ఉపాధ్యాయ జేఏసీ ఘోరావ్ చేసింది. దీక్షకు కూర్చున్న ఎమ్మెల్యే కాటసానితో పాటు ఆయనను రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యుసీ నిర్ణయానికి వ్యతిరేకంగా నగరంలో నిర్వహించిన సమరభేరి కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత తులసిరెడ్డిని లాయర్లు అడ్డుకున్నారు. పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని పట్టుపట్టగా.. తోపులాట చోటు చేసుకుంది. ఆ తర్వాత ఆయన కాటసాని దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఇక యాదవ మహసభ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి రఘువీరారెడ్డికీ సమైక్య సెగ తగిలింది. మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి సహకరించాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. విభజనను నిరసిస్తూ నీటిపారుదల ఉద్యోగుల జేఏసీ ఆధ్వరంలో 2వేల మంది ఉద్యోగులు జలమండలి నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ భవన్ వద్ద ఉపాధ్యాయులు వంటావార్పు చేపట్టి సహపంక్తి భోజనం చేశారు. ఆదోనిలో ప్రాంతీయ ఆసుపత్రి.. స్త్రీలు,పిల్లల ఆసుపత్రి నర్సులు, సిబ్బంది విధులను బహిష్కరించి సమైక్య నినాదాన్ని హోరెత్తించారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా విధులను బహిష్కరించి భీమాస్ సర్కిల్‌లో వంటావార్పు చేపట్టారు. శస్త్ర చికిత్స ద్వారా కేసీఆర్ గుండె మార్పిడి చేసి సమైక్యవాదిగా మార్చిన ప్రదర్శన ఆకట్టుకుంది.
వేలాది మంది రోడ్డెక్కి ఆట, పాటలతో నిరసన తెలపడంతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి క్రీడా మైదానాన్ని తలపించింది. నంద్యాల పట్టణంలో పెన్షనర్లు ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగులు, జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరులో పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రివర్స్ ర్యాలీ నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్‌లో బట్టలు ఉతికి నిరసన తెలిపారు.