చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్ : అప్పులబాధతో యువ రైతు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని ఖాజీపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రశాంత్ కథనం మేరకు.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఇక్బాల్ ఉపాధి కోసం ఖాజాపూర్‌కు వలస వచ్చాడు. ఆరేళ్ల క్రితం స్థానికంగా ఉన్న మహ్మద్ యాకూబ్ కుమార్తెను వివాహమాడాడు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రెండేళ్ల క్రితం మూడెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు.
పంట పెట్టుబడులు, కుటుంబ పోషణకు సుమారు రూ. 2 లక్ష మేర అప్పు చేశాడు. అయితే పంటలు చేతికి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక తరచూ మదనపడేవాడు. రుణగ్రస్తుల నుంచి అప్పు తీర్చాలని ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో అప్పులు తీర్చేందుకు వారం క్రితం కూలీ పనులు చేసేందుకు హైదరాబాద్ వెళ్లాడు. అనంతరం మంగళవారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకున్న సమయంలో భార్యాపిల్లలు తన అత్తగారింటిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో తెలియదుగాని ఇక్బాల్ తన పూరి గుడిసెలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలిన గాయాలు తట్టుకోలేక బయటకు వచ్చిన ఇక్బాల్‌ను స్థానికులు 108 వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రథ మ చికిత్స అనంతరం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో పూరి గుడిసె మొత్తం కాలిపోయింది. అందులో ఉన్న బియ్యం, గృహ అవసరాల కోసం తెచ్చుకున్న వస్తువులు సైతం కాలిబూడిదయ్యాయి. మృతుడికి భార్య వసీమా బేగం, ఒక కుమార్తె షబానా (3), కుమారుడు సాహేబ్ (2)లు ఉన్నారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రశాంత్ తెలిపారు.
యువ రైతు ఆత్మహత్యాయత్నం
Published Wed, Dec 18 2013 12:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:28 PM
Advertisement
Advertisement