రోడ్డుపై మాలతి మృతదేహం, (ఇన్‌సెట్) మాలతి(ఫైల్), ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు
ఆనందపురం(భీమిలి): మండలంలోని వేములవలస జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువతి గాయపడి చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని విజయా మెడికల్ సెంటర్‌లో పని చేస్తున్న చలపతి మాలతి, మల్లేశ్వరిలు ఒక వాహనంపై వారితో పాటు పలువురు వాహనాలపై తగరపువలసలో ఉన్న తమ స్నేహితురాలు పాపకు జరుగుతున్న నామకరణ కార్యక్రమంలో పాల్గొనడానికని విశాఖ నుంచి బయలుదేరి వెళ్తున్నారు.
వారి ద్విచక్ర వాహనాలు మండలంలోని వేములవలస జాతీయ రహదారిపైకి చేరుకునే సరికి వెనుక వైపు నుంచి వస్తున్న విశాఖ నుంచి రాజాం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక వైపు కూర్చున్న చలపతి మాలతి(26) రోడ్డుపై తూలి పడడంతో ఆర్టీసీ బస్సు వెనుక టైరు తలపై నుంచి వెళ్లి పోయింది. ఈ సంఘటనలో మాలతి తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న మల్లేశ్వరి రోడ్డుపై పడిపోయి గాయాలు పాలయింది.
మృతి చెందిన మాలతి విజయా మెడికల్ సెంటర్‌లో రిసెప్సనిస్ట్‌గా పని చేస్తుండగా ఆమెకు ఇటీవలే ఓ పాప జన్మించిందని పొలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐలు శ్రీనివాస్, గణేష్, ట్రాఫిక్ ఎస్‌ఐ సోమరాజు చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌లను అదుపులోకి తీసుకున్న ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment