మోసం చేసిన ప్రియుడికి రమణి గుణపాఠం
జగ్గయ్యపేట: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రియుడిపై ఓ ప్రియురాలు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని బంగారుపేటకు చెందిన చల్లా రాము కేసీపీ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గుంజా గాయత్రి అలియాస్ రమణితో ఐదు నెలల క్రితం రాముకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఈ నేపథ్యంలో గత గురువారం(14వ తేదీ) రాముకు వివాహమైంది. విషయం తెలుసుకున్న రమణి సోమవారం రాముకు ఫోన్ చేసింది. పెళ్లి కానుక ఇస్తానని, పద్మావతి చెక్‌పోస్టు వద్దకు రమ్మని చెప్పింది. రాము అక్కడకు చేరుకున్న అనంతరం ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై జయంతిపురం గ్రామం మీదుగా వేదాద్రి అటవీ ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి వెళ్లారు. నీకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానంటూ రమణి చున్నితో రాము కళ్లకు గంతలు కట్టింది. అప్పటికే ఆమె వెంట తెచ్చుకున్న కత్తితో రాము మెడపై పొడిచి పరారైంది.
ఈ పరిణామంతో కంగుతున్న రాము పేట ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. అనంతరం దాడి విషయం కుటుంబ సభ్యులకు తెలుపగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. మంగళవారం తెల్లవారు జామున పోలీసులు రమణిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, అందుకే కత్తితో పొడిచినట్లు ఆమె అంగీకరించడంతో సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడ్డ రాము విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.