ఛాటింగ్ మత్తులో యువత.. | youths are interested on chatting | Sakshi
Sakshi News home page

ఛాటింగ్ మత్తులో యువత..

Published Thu, Nov 13 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

ఛాటింగ్ మత్తులో యువత..

ఛాటింగ్ మత్తులో యువత..

కంప్యూటర్‌తో చేతులు కలిపి కొత్త ప్రపంచానికి కిటికీలు(విండోస్) తెరిచాం. మీటల(కీబోర్డ్)తో ఆటలు నేర్చిన వేళ్లు శోధన యంత్రం(సెర్చింజన్)లో పయనిస్తున్నాం. అంతర్జాలానికి(ఇంటర్నెట్) మంత్రం వేసి అవాహనం చేసుకున్నాం. నవయుగానికి దారులు వేస్తూ భూమికి అవతలి వైపునకు చూస్తూ పిచ్చాపాటి (ఛాటింగ్) మొదలుపెట్టాం. అందరితోనూ మాటలు(సోషల్ నెట్‌వర్కింగ్) కలిపి కొత్త ప్రపంచాన్ని సృష్టించాం.

అంతటితో ఆగామా..! నేటి కాలం నిత్యావసరం..చేతిలో అమరిపోయే బుల్లి పరికరంతో(మొబైల్) ఖండాంతరాలు దాటి మాటలు కలుపుతున్నాం. ప్రపంచ విజ్ఞానాన్ని, సుదూరంలో ఉన్న సన్నిహితుల యోగక్షేమాలను తెలుసుకోడానికి రోజుకో కొత్త పేజీ(యాప్)ని సృష్టించుకుంటున్నాం. ‘ఈ-ప్రపంచంలో(నెట్‌వరల్డ్)లో మేలెంతుందో కీడూ అంతే వుంది.        
            
విశాఖ రూరల్ : ఛాటింగ్.. నేటి ఆధునిక తరంలో వచ్చిన అద్భుతం. దేశ విదాశాల్లోని వ్యక్తులందరితోనూ సంభాషిస్తూ, వారి మనోభావాలను, విజ్ఞానాన్ని పంచుకోడానికి ఇదో అద్వితీయమైన సాధనం. ప్రపంచ వ్యాప్తంగా క్షణాల్లో సందేహాలు తీర్చుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఉండడం వల్ల లైవ్ ఛాటింగ్‌లకు రోజురోజుకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ మధ్యకాలంలో ఛాటింగ్ ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.

ప్రపంచంలో ఎక్కడివారినైనా పరిచయం చేసుకునే అవకాశం ఉండడంతో కంప్యూటర్, సెల్‌ఫోన్ కోసం తెలిసిన ప్రతి ఒక్కరికీ ఛాటింగ్ ఒక అలవాటైపోయింది. దాంతో అనేక బహుళజాతి కంపెనీలు ఆన్‌లైన్ ఛాటింగ్‌లతో పాటు సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లను ప్రవేశపెట్టాయి. గతంలో ఒక వెలుగువెలిగిన ఆర్‌కుట్ ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోగా.. ప్రస్తుతం ఫేస్‌బుక్, ట్విట్టర్, హాయ్5, ఇండియా రాక్స్, పికాసా ఇలా వందల సంఖ్యలో సోషల్ నెట్‌వర్కింగ్  సైట్లు ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్నాయి.

వీటి రాకతో నెట్ ఛాటింగ్ కాస్త వెనుకబడ్డా వినియోగం మాత్రం తగ్గలేదు. అయితే మెసెంజర్లలో వ్యక్తిగత వివరాలు ఇతరులకు తెలిసే అవకాశం లేదు. సోషల్ నెట్‌వర్క్‌లలో మాత్రం వ్యక్తిగత సమాచారంతో పాటు స్నేహితులతో చేసిన సంభాషణలు కూడా ప్రతి ఒక్కరికీ పూర్తిగా తెలిసిపోతుంది. వీటిలో కొన్ని సెక్యూరిటీ మెళకువలు ఉన్నా అవి పూర్తి స్థాయిలో మేలును కలిగించేవి కావని నిపుణుల భావన.
 
ఛాటింగ్ మత్తులో యువత..
ఛాటింగ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఛాటింగ్ ఒక అవసరంలా కాకుండా యువతకు ఒక నిషాగా మారిపోయింది. ఆ మత్తులో కెరీర్‌ను నాశనం చేసుకున్న వారిలో యువతీ, యువకులు కోకొల్లలు. ఈ ఛాట్ రూమ్‌లు కొంత మందికి తమ కెరీర్ మలుచుకోడానికి పనికివస్తుంటే మరికొంత మందికి చేదు అనుభవాలను మిగుల్చుతున్నాయి. ఛాటింగ్‌లతో సమయాన్ని వృథా చేసిన వాళ్లు నూటికి 90 శాతం యువతరమే. జీవితాన్ని నిర్ణయించుకునే ప్రధానమైన దశలో ఎక్కువ సమయం ఛాటింగ్‌ల మూలంగా వ్యర్థమైపోతోంది.
 
ఛాటింగ్ ఉపయోగాలు..
* విజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతూ గొప్ప ఆశయాలతో ముందడుగు వేస్తున్నా ఉపయోగించుకునే వారిని బట్టి అది అందించే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కత్తి ఒకటే అయినా దాన్ని ఉపయోగించిన వారిని బట్టి ప్రయోజనం మారినట్టే చక్కగా ఉపయోగించుకుంటే ఛాటింగ్ మన అభివృద్ధికి రాచబాట వేస్తుంది.
* తెలివైన వారు, విభిన్న రంగాల్లో నిపుణులతో ఛాటింగ్ మనకి ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్పిస్తుంది.
* అనుకోకుండా వచ్చే సందేహాలను అప్పటికప్పుడు వెంటనే నివృత్తి చేసుకోడానికి చాలా రెట్లు బాగా ఉపకరిస్తాయి.
* పరిస్థితుల ప్రభావం వల్ల కలిగే ఒత్తిడిల నుంచి చక్కని పరిష్కారాన్ని మిత్రుల ద్వారా పొందవచ్చు.
* ముఖాముఖి సంభాషణ చేయవచ్చు.
* పరీక్షా సమయంలో విద్యార్థులు సందేహాలు నివృత్తి చేసుకోడానికి అనుకూలం.
* కాలేజీల్లో, సంస్థల్లో కార్యక్రమాలు జరిపే బృందాల మధ్య సమాచారం పంచుకునేందుకు ఇంటర్నెట్ ఛాటింగ్ ఉపయోగపడుతుంది.
* సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డేటా, ఫొటోలు, వీడియోలు, సాఫ్ట్‌వేర్ ఇలా ప్రతీది ఒక గ్రూప్‌లో ఉన్నవారితో ఒకేసారి పంచుకోవచ్చు.
* మిగతా సమాచార వ్యవస్థలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారితోనైనా మాట్లాడవచ్చు.
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* ఛాటింగ్.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అనర్ధాలు ఎక్కువే ఉన్నాయి. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
* పొఫైల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉంచకూడదు. అలాగే ప్రొఫైల్ ఆధారంగా ఎదుట వ్యక్తిని అంచనా వేయకూడదు.
* ఛాట్‌చేసిన ప్రతీ వ్యక్తిని ఫ్రెండ్స్ లిస్టులో చేర్చుకోకండి. దాని వల్ల ఇష్టం లేని వ్యక్తుల నుంచి తప్పించుకోవడం కష్టమవుతుంది. వారి బారిన పడకుండా ఉండడానికి లాగిన్ అయిన ప్రతీసారి ఇన్‌విజిబుల్ మోడ్‌లోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా అయితే మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్న ఫ్రెండ్స్‌కు మీరు దూరమైపోతారు.
* అపరిచితుల నుంచి వచ్చిన ఇమేజ్‌లు, లింక్‌లు, మెసేజ్‌లను తొందరపడి ఓపెన్ చేయకండి. వాటిలో వైరస్ ఉండే అవకాశం ఉంటుంది.
* ఛాటింగ్‌లో కలిసిన ఫ్రెండ్స్‌ను అక్కడే పరిమితం చేయాలి. ముక్కూమొహం తెలియని వారికి నేరుగా కలుసుకోడానికి ప్రయత్నించకూడదు.
* చిన్న పిల్లలు ఛాటింగ్‌లో కూర్చొని ఉన్నప్పుడు దగ్గర ఉండి పరిశీలించాలి.
* సైబర్ కేఫ్‌లలోని కంప్యూటర్ల ద్వారా మీరు ఛాటింగ్ చేస్తున్నట్లైతే ‘లాగ్ ఆన్ ఆటోమేటికల్లీ’ ఆప్షన్‌ను సెలక్ట్ చేయకండి. మీ తరువాత ఆ సిస్టంపై కూర్చున్న వారు మీ ఐడీతో ఛాట్ చేసే ప్రమాదం ఉంది. మెసెంజర్ నుంచి పూర్తిగా లాగ్‌అవుట్ చేసిన తరువాతే సైబర్‌కేఫ్ నుంచి బయటకు రండి.
* ‘వన్నా ఛాట్ విత్ మీ’ అంటూ అడగకుండానే ముందుకు వచ్చి పదే పదే బజ్ చేస్తూ విసిగించే వారిని ఎక్కువగా ఎంటర్‌టైన్ చేయకండి. ఛాట్ రూముల్లో జరిగే చర్చల్లో నథింగ్‌లు, నాన్సెన్స్‌లే ఎక్కువ. మీ కెరీర్‌కి ఉపయోగపడే ఛాట్ రూమ్‌ను ఎంపిక చేసుకోవడంలో శ్రద్ధ వహించాలి. అన్నింటినీ మించి ఆఫీసులో ఛాటింగ్ చేయకండి. ఆఫీస్‌లో మీరు ఎవరితో ఛాట్ చేస్తున్నారో మీ బాస్ కనిపెట్టే అవకాశం ఉంటుంది.
* ఛాటింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ లో అపరిచితులతో మాట్లాడడం మంచిది కాదు. ఛాటింగ్ ద్వారా ఛీటింగ్ చేసిన కేసులు లెక్కకందనన్ని నమోదయ్యాయి.
* ఇంట్లో టీ నేజ్ పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారో పరిశీలించాలి.
* ముఖ పరిచయం లేనివారితో ఛాటింగ్ ఆసక్తిగా ఉన్నా అంత సేఫ్ కాదన్న విషయాన్ని గుర్తించాలి.
* కాబట్టి యువతీయువకులు ఛాటింగ్, సోషల్‌నెట్‌వర్క్‌లతో బీ కేర్‌ఫుల్.
 
మొబైల్ అప్లికేషన్ల హవా
నిన్న మొన్నటి వరకు కంప్యూటర్లలో చాటింగ్ కొనసాగితే.. స్మార్ట్‌ఫోన్లు ఆ పరిస్థితులను మార్చివేశాయి. కంప్యూటర్ల అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్లలో ఛాటింగ్ అప్లికేషన్‌లు వెల్లువెత్తుతున్నాయి. వాట్సాప్, వీఛాట్, ఛాటాన్, హైక్, ఫెస్‌బుక్ మెసెంజర్ ఇలా రోజుకో కొత్త అప్లికేషన్లు పుట్టుకొస్తున్నాయి.

విదేశీ కంపెనీల నిర్వహణలో ఉన్న ఈ లైవ్‌ఛాట్ అప్లికేషన్లకు మంచి డిమాండ్ ఏర్పడడంతో దేశీయ కంపెనీలు సైతం ఈ ఛాట్ యాప్‌లపై దృష్టి సారించాయి. విదేశీ యాప్‌లకు ధీటుగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. దేశీయ ఐటీ కంపెనీలు రూపొందించే యాప్‌లను వినియోగించి తద్వారా దేశాభివృద్ధికి, ఇక్కడ ఐటీ పురోగతికి సహకారం అందించాలని సాక్షాత్తు దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇటీవలే పిలుపునిచ్చారు. దీన్ని బట్టే ఛాటింగ్ అప్లికేషన్ల హవా ఎంత మేర ఉందో, వాటి ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement