
వివేకా బావమరిది తనకు ఫోన్ చేసి చనిపోయిన విషయం చెప్పారని, వెంటనే...
సాక్షి, వైఎస్సార్ : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మరణం గురించి పూర్తి వివరాలు తెలియకుండా హత్య అని ఎలా చెప్తాం?.. వివేకానందరెడ్డిని హత్య చేశారనే వార్త తెలిస్తే జిల్లాలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉంది.. అందుకే విజ్ఞతతో వాస్తవాలు తెలిసే వరకు హత్య అని ప్రకటించలేద’న్నారు ఆయన కుటుంబ సభ్యుడు, వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి హత్య ఉదంతాన్ని ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు.
విచారణ చేయకుండా శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వివేకా బావమరిది తనకు ఫోన్ చేసి చనిపోయిన విషయం చెప్పారని, వెంటనే ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ఆయనది అనుమానాస్పద మృతి అని మందే చెప్పామన్నారు. వివేకానందరెడ్డి గురించి తెలిసిన వారెవరైనా ఆయనను హత్య చేసుంటారని ఊహించరన్నారు. సిట్ విచారణతో ఉపయోగం లేదని, వివేకా హత్యపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.