సాక్షి పులివెందుల : అజాత శత్రువుగాపై పేరున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనక పెద్ద కుట్రే ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఆయనను అంతమొందించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ప్రత్యర్థుల వ్యూహంలో భాగంగానే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. వివేకానందరెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా వైఎస్సార్ సీపీని దెబ్బతీసి జిల్లాలో పట్టు సాధించేందుకే ఆయనను హత్య చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (వివేకానందరెడ్డి మృతి.. డోర్ లాక్ ఎవరు తీశారు?)
తన సోదరుడి కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న వివేకానందరెడ్డి గత కొద్దిరోజులుగా వైఎస్ఆర్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్ అయిన వివేకానందరెడ్డి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. చాలాకాలంగా తనకున్న పరిచయాలను ఉపయోగించి అందరిని కలుపుకుని వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం జమ్మలమడుగు, మైదుకూరులో ప్రచారం నిర్వహించారు. చాపాడు మండలం మద్దూరులో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడింటి వరకు ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి 9:30 గంటలకు పులివెందుల చేరుకున్నారు.
వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ హైదరాబాద్‌లో ఉన్నందున ఇంట్లో ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయన తలుపులు వేసుకున్నాక డ్రైవర్ వెళ్లిపోయారు. తెల్లవారాక పీఏ కృష్ణారెడ్డి వచ్చి తలుపులు తట్టగా ఎలాంటి స్పందనా రాలేదు. మరో అరగంట తర్వాత పనిమనిషి వచ్చి తలుపులు తట్టినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్‌లో ఉన్న వివేకానందరెడ్డి భార్యకు ఫోన్ చేశారు. ప్రచారంలో పాల్గొని వచ్చినందున అలిసిపోయి పడుకుని ఉంటారని ఆమె చెప్పడంతో మరింత సమయం నిరీక్షించారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో వెనకవైపు కిటికీలోంచి పిలవడానికి వెళ్లగా అక్కడ తలుపు తెరిచే ఉంది. లోపలికి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. తొలుత గుండెపోటు లేదా బ్రెయిన్ హెమరేజ్‌గా భావించినా.. తర్వాత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డికి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పోస్టుమార్టం జరిగింది. ఆయన ఒంటిపై ఏడు గాయాలు ఉండగా, పదునైన ఆయుధంతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. నుదుటిపై రెండు గాయాలు, మెదడు భాగంలో ఒక గాయం, ఛాతిపైన రెండు గాయాలు, తొడ భాగంలో ఒక గాయం, చేతిపైన మరో గాయం ఉంది. బహుశా దాడి చేసే సమయంలో ఆయన చేతిని అడ్డుపెట్టి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే కచ్చితంగా హతమార్చాలన్న దురుద్దేశంతోనే దుండగులు వచ్చి ఉంటారని దాడిని బట్టి చూస్తే అర్థమవుతోంది. రాత్రి వేళ వైఎస్ వివేకానందరెడ్డి ఒంటరిగా ఉంటున్నారన్న సమాచారం పక్కాగా దుండగులకు తెలిసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అత్యంత సౌమ్యుడుగా పేరుపడ్డ వివేకా.. జనసామాన్యంలో కలిసిపోతారు. ఎలాంటి భద్రత లేకుండా ప్రచారానికి వెళ్తారు. ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కుటుంబ సభ్యులు కూడా అనుమానించలేదు. వివేకానందరెడ్డి కూడా ఎన్నో పదవుల్లో పని చేసినా.. కనీసం వ్యక్తిగత సెక్యూరిటీ కూడా పెట్టుకోలేదు. ఇంట్లో కనీసం పనివాళ్లు కూడా లేకున్నా ఒంటరిగా ఉన్నారు. అయితే దుండగులు ఎప్పుడు ఇంట్లోకి చొరబడ్డారన్నది ఇప్పుడు సశేష ప్రశ్న. దుండగులు వెనక భాగం నుంచి వచ్చి హత్య చేశారా? లేదా ముందుగానే ఇంట్లో దూరి హత్య చేసిన అనంతరం వెనకవైపు నుంచి బయటకు వెళ్లారా? అనేదానిపై అనుమానాలున్నాయి. ఇంట్లో తలుపులేవీ పెద్దగా దెబ్బతిన్నట్టు కనిపించలేదు. అంటే పరిచయం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి వివేకానందరెడ్డితోనే తలుపులు తీయించారా అన్నది మరో అనుమానం.
రాత్రి 11 గంటలు అంటే దాదాపుగా ఊరంతా నిద్రపోయే సమయంలో వైఎస్ వివేకాను హతమార్చాలన్న పక్కా స్కెచ్‌తో దుండగులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇల్లు, దాని పరిసరాలు, ఎలా రావాలి, ఎలా పోవాలి అన్న విషయంలో ముందుగానే రెక్కీ చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా వివేకానందరెడ్డికి సెక్యూరిటీ లేకపోవడం, ఇంట్లో ఇతర వ్యక్తులు లేకపోవడం దుండగులకు కలిసివచ్చినట్టు భావిస్తున్నారు. ఎలాంటి అలికిడి లేకుండా ఇంట్లోకి చొరబడడం, తక్కువ సమయంలో హత్య చేయడం, ఆ వెంటనే పారిపోవడం.. ఇదీ దుండగుల పథకంగా కనిపిస్తోంది.
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటే బోలెడు కారణాలు కనిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు.. అదీ పోలింగ్‌కు సరిగా 25 రోజుల ముందు వివేకానందరెడ్డిని హత్య చేయడం వల్ల ఓ బలమైన సంకేతం ఇవ్వాలన్న తాపత్రయం కనిపిస్తోంది. పులివెందులలోనే వివేకాను హత్య చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చేయవచ్చన్న వ్యూహం కనిపిస్తోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రస్తుతం జిల్లాలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు వివేకానందరెడ్డి. గత 30 ఏళ్లుగా జిల్లాలో ఆయనకు పరిచయాలున్నాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు వివేకానందరెడ్డి. ఈ ఎన్నికల్లో కూడా తన సంబంధాలను మరింత మెరుగుపరిచి దూసుకుపోతున్న వివేకాను టార్గెట్ చేస్తే అటు పార్టీని, ఇటు జిల్లాలో పట్టును సంపాదించవచ్చనుకున్నారా అన్నది తేలాలి.
Comments
Please login to add a commentAdd a comment