
సాక్షి, అమరావతి : దిశ యాప్ ద్వారా ఓ మహిళకు సాయం అందించిన పోలీసులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మహిళల భద్రత, దిశ పథకం, దిశ యాప్ అమలు తీరుపై మంగళవారం సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశ యాప్ సాధించిన విజయాన్ని గౌతం సవాంగ్ సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు.
‘విశాఖపట్నం నుంచి విజయవాడ బస్సులో వస్తున్న మహిళను తోటి ప్రయాణికుడు వేధించడంతో బాధితురాలు దిశయాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. తెల్లవారుజామున 4.21 గంటలకు బాధితురాలి నుంచి ఎస్‌వోఎస్ కాల్ ద్వారా మంగళగిరి దిశ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో కాల్ సెంటర్ సిబ్బంది వెనువెంటనే సమీపంలోని ఎమర్జెన్సీ టీమ్‌కు సమాచారం అందించారు. కేవలం 5 నిమిషాల్లోనే ఏలూరు సమీపంలో బస్సువద్దకు దిశ టీమ్ చేరుకొని వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు 3వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ కేసు నమోదు చేశారు’ అని సవాంగ్ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఈ ఘటనపై సీఎం జగన్ పోలీసులకు అభినందనలు తెలిపారు.
చదవండి : మహిళకు సాయపడ్డ ‘దిశ’ యాప్