
సోనియా గాంధీ గీసిన గీతను కిరణ్ దాటడు:జగన్
కలికిరి(చిత్తూరు జిల్లా): సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య ముసుగు వేసుకుని రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గీసిన గీతను కిరణ్ రెడ్డి దాటను గాక దాటడని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా మంగళవారం సాయంత్రం కలికిరి సభకు హాజరైన జగన్ కు అభిమానులు పూలతో స్వాగతం పలికారు. ముందుగా ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆసభకు హాజరైన అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
గతంలో కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ ప్రతీది కలిసి కట్టుగానే చేశారని, ఇప్పడు రాష్ట్ర విభజన విషయంలో కూడా అదే పునారావృతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐఎంజీ భారత్‌కు 830 ఎకరాల భూమిని అడ్డుగోలుగా కట్టబెట్టింది చంద్రబాబు కాదా? కానీ సీబీఐ మాత్రం నోటీసులు కూడా జారీ చేయలేదన్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తనపై కేసులు పెట్టాయన్నారు. వాస్తవంగా 3 నెలల్లో బెయిల్ రావాల్సి ఉన్నా , 16 నెలలపాటు అక్రమంగా నిర్బంధంలో పెట్టడానికి కాంగ్రెస్-టీడీపీలే కుమ్మక్కు రాజకీయమే కారణమన్నారు. ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా కూడా చంద్రబాబుతో కాంగ్రెస్ కుమ్మక్కయిన విషయం వాస్తవం కాదా?అని జగన్ ప్రశ్నించారు.
ఈ నడి రోడ్డుమీదకు వచ్చిన ప్రతీ పిల్లాడి గుండె చప్పుడు జై సమైక్యాంధ్ర అని నినదిస్తుంటే... రాష్ట్రంలో ఉన్న నాయకులకు కనీసం జ్ఞానం లేదన్నారు. విభజన జరిగితే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రతీ రైతన్న ప్రశ్నిస్తుంటే ఈ నేతలు ఏ సమాధానం చెబుతారన్నారు. సోనియా గాంధీని కాలర్ పట్టుకుని అడగాల్సిన ఈ గడ్డమీద పుట్టిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విభజనకు సహకరించడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెడితే వీగిపోతుందని భయపడి, నేరుగా పంపించి చర్చించుకోమని వదిలేశారన్నారు. చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ఎమ్మెల్యేలను, తెలంగాణ ఎమ్మెల్యేలను వేరువేరుగా పిలిపించుకుని తలో మాట చెబుతారని జగన్ ఎద్దేవా చేశారు.