చీమ కుట్టినట్టయిన లేదు
రాష్ట్రాన్ని ఎలా విభజించాలన్న కుట్రలోనే వారు మునిగి తేలుతున్నారు
కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నామని
నేత కార్మికులు వాపోతున్నారు
మద్దతు ధర దక్కక చెరకు రైతులు
చెరకు అమ్ముకోలేకపోతున్నారు
కిరణ్, బాబులు సొంత జిల్లా ప్రజలనే గాలికొదిలేశారు
సోనియా కనుసన్నల్లో ఒకరు..
ప్యాకేజీలకోసం కుమ్మక్కవుతూ మరొకరు..
రాష్ట్రంలో రైతులు, ప్రజలు వేల సమస్యలతో సతమతమవుతున్నా కిరణ్, బాబులకు పట్టడం లేదు: జగన్
‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:
రాష్ట్రంలో రైతులు వేలాది సమస్యలతో సతమతమవుతున్నా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు చీమకుట్టినట్టయినా లేదని, ప్రజల్ని గాలికొదిలేసి రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అన్న కుట్రల్లోనే వారు మునిగి తేలుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. సొంత జిల్లా ప్రజలనే పట్టించుకోని వీరికి ఇక రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం పడతాయని దుయ్యబట్టారు. ‘‘చిత్తూరు జిల్లా నగరి పరిసర ప్రాంతాల్లో నేత కార్మికులు అధికంగా ఉన్నారు. అలాగే చెరకు పండించే రైతులు కూడా. అయితే కరెంటు బిల్లులు కట్టలేక నేత కార్మికులు.. మద్దతు ధర దక్కక చెరకు రైతులు అష్టకష్టాలు పడుతుంటే ఈ జిల్లాకే చెందిన ముఖ్యమంత్రికీ పట్టదు. ప్రతిపక్ష నేతకూ పట్టదు’’ అంటూ నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ నాలుగో విడత ఆరో రోజు శనివారం యాత్రలో భాగంగా రాత్రి నగరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఆ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
‘‘నేను ఈ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు నా దగ్గరకు కొందరు నేత కుటుంబాలకు చెందిన అక్క చెల్లెమ్మలొచ్చారు. వచ్చి.. అన్నా కరెంటు బిల్లు నాలుగైదు వేల రూపాయలొస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. నగరి పరిసరాల్లో 15 వేల మరమగ్గాలున్నాయి. ఒక్కో మగ్గానికి సగటున నెలకు 300 యూనిట్లు కరెంటు ఖర్చవుతుంది. యూనిట్‌కు రూ.3.55 చొప్పున బిల్లు వేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా సర్‌చార్జి అని, ఇంధన చార్జీలని, రకరకాల పేర్లతో కరెంటు బిల్లు నాలుగైదు వేల రూపాయలు వస్తోంది. అదే పది కిలోమీటర్ల అవతల ఉన్న తమిళనాడు రాష్ట్రంలో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారంటూ ఆ మరమగ్గాల కార్మికులు వాపోయారు. గతంలో దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.1.75 ఉన్న కరెంటు చార్జీలను సగానికి తగ్గించి 87 పైసలకే ఇచ్చారు. అందుకోసం ప్రత్యేకంగా జీవో కూడా జారీచేశారు. ఆ జీవో కాపీ తీసుకుని కరెంటు వాళ్ల దగ్గరకు వెళితే నాడు దివంగత నేత ఇచ్చిన జీవో ఇప్పుడు చెల్లదంటున్నారని ఆ మరమగ్గాల కార్మికులు వాపోయారు.
చెరకు రైతులకు గతేడాది బకాయిలివ్వలేదు
నిన్న, మొన్న నేను గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించా. అక్కడ చెరకు విస్తారంగా పండిస్తారు. ఆ రైతులను పలుకరిస్తే ఒళ్లు జలదరించే వాస్తవాలు తెలిశాయి. చిత్తూరు సుగర్ ఫ్యాక్టరీ నిరుడు రైతుల వద్ద నుంచి కొన్న చెరకుకు చెల్లించాల్సిన బకాయిల్లో ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ సంవత్సరం ధర ఎంతో ఇప్పటికీ తేల్చలేదు. తోలకం ఖర్చులకు టన్నుకు రూ.300 మాత్రం ఇస్తున్నారు. ఇలా లాభం లేదనుకుని సొంతంగా బెల్లం తయారు చేసుకుందామనుకుంటే ఆ రైతులకు రోజుకు కనీసం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వని పరిస్థితి ఉంది. వేలాది మంది రైతులు, నేత కార్మికులు ఇన్ని సమస్యలతో సతమతమవుతుంటే ఇదే జిల్లాకు చెందిన సీఎంకు కానీ, ప్రతిపక్ష నేతకు కానీ చీమ కుట్టినట్టయినా లేదు.
వీరి నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం
ప్రజల సమస్యలపై కిరణ్, చంద్రబాబుల నిర్లక్ష్యానికి మరో సజీవ సాక్ష్యం నగరి పట్టణంలోనే కనిపించింది. నగరి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ‘సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్’ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. ఆ మహానేత మరణించి నాలుగేళ్లు దాటుతున్నా ఆ సమ్మర్ స్టోరేజి ట్యాంకుకు ఈ ప్రభుత్వం నీటిని సరఫరా చేయలేదు. ఈ జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి పట్టించుకోరు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించరు. ఈ జిల్లాలో సుగర్ ఫ్యాక్టరీ కొడిగడుతోంది. డైరీ మూతపడింది. నేత కార్మికులు తమ మరమగ్గాలను మూలన పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలేవీ ఈ నాయకులకు పట్టవు.
ఇంత అన్యాయమైన విభజన..
ప్రజలకు వంటగ్యాస్ అందుబాటులో ఉండటం లేదు. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే చార్జీల మోత మోగుతోంది. ‘ఆరోగ్యశ్రీ’ నుంచి 133 రోగాలను తప్పించేశారు. విద్యాసంవత్సరం పూర్తి కావస్తున్నా విద్యార్థుల ఫీజు బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఈ సమస్యల్లో వేటిమీదా అసెంబ్లీలో చర్చించడం లేదు. సమస్యలను పక్కన పెట్టి రాష్ట్రాన్ని ఎలా విభజించాలో చర్చిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఇంత అన్యాయంగా విభజన ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. రాష్ట్రంలో 70 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నా ఖాతరు చేయకుండా ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించేందుకు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అని బాధేస్తుంది. సోనియా గీచిన గీత దాటని సీఎం ఉండడం వల్లే ఇంత ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని విభజించే ధైర్యం ఆమెకు వచ్చింది. పాలక పక్షాన్ని కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత ప్యాకేజీల కోసం కుమ్మక్ము రాజకీయాలకు పాల్పడుతుండటం వల్లే సోనియాకు అంత తెగువ వచ్చింది. పై నుంచి దేవుడనే వాడు చూస్తూనే ఉన్నాడు. 70 శాతం మంది రాష్ట్ర ప్రజల ఉసురు తగలక పోదు. సోనియా, కిరణ్, చంద్రబాబు ఈ ముగ్గురినీ బంగాళాఖాతంలో కలిపే రోజు ఎంతో దూరంలో లేదు. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి. మనమే సొంతంగా 30 పార్లమెంటు సీట్లు సాధించుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దాం.’’
యాత్ర సాగిందిలా..
శుక్రవారం రాత్రి నగరిలో బసచేసిన జగన్ శనివారం ఉదయం తొలుత నగర శివార్లలోని దేశమ్మగుడిలో పూజలు చేశారు. అనంతరం వేలావడిలో వైఎస్‌ఆర్ సీపీ జెండాను, దేశూరు అగరంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆరూరులో వడివేలు కుటుంబాన్ని ఓదార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సత్రవాడ చేరుకున్న జగన్‌ను చూసేందుకు ప్రజలు పోటెత్తడంతో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరిలో సభాస్థలిని చేరుకునేందుకు దాదాపు నాలుగున్నర గంటలు సమయం పట్టింది. జగన్ సభాస్థలికి రాత్రి 9.30గంటలకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. ఆరో రోజు యాత్రలో జగన్‌తో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, పార్టీ నేతలు రోజా, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.