సోనియా గాంధీని ప్రశ్నించకుండా ప్యాకేజీలు అడుగుతారా?
చిత్తూరు:అసెంబ్లీ సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలు దొంగనాటకాలాడుతున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.జిల్లాలోని పూతలపట్టు సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. సోనియా గాంధీ ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని జగన్ విమర్శించారు. ఆమె గీసిన గీతను కిరణ్ దాటకుండా విభజనకు సహకరిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనకు పూనుకుంటున్న సోనియాను చంద్రబాబు ప్రశ్నించకుండా, ప్యాకేజీలంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఆయన నోట సమైక్యాంధ్ర అన్న మాటే రావడంలేదని, అసెంబ్లీలో రాష్ట్రాన్ని విడగొట్టడానికి చర్చ జరుపుతున్నారన్నారు.
దేశంలో ఎక్కాడా లేని విధంగా రాష్ట్రాన్ని విభజిస్తూ ప్రజలకు మరిన్ని సమస్యలు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని జగన్ అన్నారు.70 శాతం ప్రజలు ఒప్పుకోక పోయినా బిల్లును రాష్ట్రానికి పంపి, ఆ బిల్లుపై వీళ్లంతా చర్చించడం దురదృష్టకరమన్నారు. అన్యాయం అయిపోతున్న అక్కాచెల్లెళ్లపై అసెంబ్లీలో చర్చ జరగక పోవడం బాధాకరమన్నారు. రానున్న ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దామని జగన్ సూచించారు.