
గోదారికి ఆ దరి.. అభిమాన ఝరి
‘పశ్చిమ’లో జగన్‌పై వెల్లువెత్తిన జనాదరణ
‘తూర్పు’ పర్యటనలో అనివార్యమైన జాప్యం
సాక్షి, కాకినాడ : పురపోరు సందర్భంగా ‘జనభేరి’ మోగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజల అభిమానం వరద గోదారిలా వెల్లువెత్తుతోంది. ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పడుతుండడంతో పర్యటనలో తీవ్ర జాప్యం అనివార్యమవుతోంది. ముందు నిర్ణయించిన ప్రకారం జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకొని, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కొవ్వూరు మీదుగా రాజమండ్రి చేరుకోవాల్సి ఉంది.
అయితే పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రతి చోటా ప్రజలు తమ అభిమాన నేతను చూసేందుకు పరవళ్లు తొక్కుతున్నారు. దీంతో పర్యటన ముందు నిర్ణయించినట్టు కాక.. గంటల కొద్దీ ఆలస్యంగా సాగుతోంది. శనివారం నాటి పర్యటన ముందు రూపొందించిన షెడ్యూల్ ప్రకారం కాక ఆరుగంటలకు పైగా ఆలస్యంగా జరిగింది.
దాంతో ఆదివారం కూడా జగన్ పర్యటన పూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే జరపక తప్పడం లేదు. తూర్పు గోదావరి జిల్లాకు ఆయన రాక ఒకరోజు ఆలస్యం కానున్నా.. పర్యటన మాత్రం ముందు నిర్ణయించిన ప్రాంతాల్లోనే మూడురోజుల పాటు జరగనుంది.