సాక్షి, నంద్యాల : ‘ఆల్ ది బెస్ట్ అన్నా...!’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నిన్న (సోమవారం) నంద్యాలలో ఉప ఎన్నికల పోరు ప్రచార ముగింపు సభ పూర్తయిన తరువాత ఆయన... మోహన్ రెడ్డిని గట్టిగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు.
వీరిద్దరూ 13 రోజులుగా ప్రచార రథంపై అలుపూ సొలుపూ లేకుండా తిరిగారు. ఎస్పీజీ మైదానంలోనూ, గాంధీ చౌక్‌లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించారు. తొలుత రోడ్‌షో ద్వారా ప్రచారం మొదలు పెట్టినా.. జనాభిమానం వెల్లువెత్తడంతో అది కాస్తా పాదయాత్రగా మారింది. ఎండనకా వాననకా తిరిగిన నేతలిద్దరూ ప్రచారం చివరి రోజున ప్రచార రథంపైనే ఆలింగనం చేసుకున్నపుడు చూసిన వేలాదిమంది కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
కాగా కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ప్రచార పర్వం నిన్నటితో ముగిసింది. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 23వ తేదీ బుధవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 141 సమస్యాత్మకంగా, 74 అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 6 కంపెనీల పారా మిలటరీ బలగాలను రప్పించారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఆ ప్రాంతాల్లో ఓటింగ్ సరళిని వీడియో చిత్రీకరణ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లకు సరిపడా ఈవీఎంల ను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఇబ్బందులేవైనా తలెత్తితే అదనంగా కూడా ఈవీఎంలను సిద్ధం చేశారు. ఈ నెల 28న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితం వెల్లడి కానుంది.