
‘అధికార పక్షానికి జగనే ఓ సమస్య’
ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అధికారపక్షం ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేసిందని, సభ జరిగిన తీరు పూర్తి అప్రజాస్వామికంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తరువాత ఆయన తన ఛాంబర్‌లో విలేకరులతో కొద్ది సేపు ముచ్చటించారు. అసెంబ్లీ జరిగిన తీరు, ప్రజా సమస్యల పట్ల అధికారపక్షం వ్యవహరించిన వైఖరిని జగన్ తీవ్రంగా తప్పు పట్టారు.
బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున తాము లేవనెత్తిన ఏ అంశంపైనా విచారణకు ప్రభుత్వం సిద్ధపడక పోగా తప్పించుకుని పోయేందుకు, అసలు విషయాన్ని దారి మళ్లించేందుకే ప్రయత్నించిందని ఆయన అభ్యంతరం తెలిపారు. సమావేశాలను జగన్ సమీక్షిస్తూ..... ‘సభ జరిగిన తీరుపై నేను చెప్పడం కన్నా... అది ఎంత అప్రజాస్వామికంగా జరిగిందో అనడానికి మీరే (మీడియా) మొట్టమొదటి సాక్షులు. సభ చాలా దారుణంగా జరిగింది. చిట్ట చివరి రోజు కూడా మేం లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరూ చూశారు.
నన్ను తిడితే స్పీకర్‌కు, ముఖ్యమంత్రికీ ఆనందమా!?
ఈ సభలో వాళ్లు (అధికారపక్షం) నన్ను ఇష్టమొచ్చినట్లు తిట్టొచ్చు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూస్తూ చాలా బాగా ఆనందిస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు టీడీపీ నుంచి అందరూ నన్ను తిట్టే వాళ్లే.... నేను మైక్ తీసుకుని రెండు మాటలు మాట్లాడేటప్పటికి పదే పదే కట్ చేసేస్తున్నారు. నేను మాట్లాడుతున్నపుడు ముఖ్యమంత్రి మూడు సార్లు, మంత్రులు అచ్చెన్నాయుడు నాలుగైదు సార్లు, అయ్యన్నపాత్రుడు రెండు సార్లు జోక్యం చేసుకుని అడ్డు తగులుతూ మాట్లాడారు. మొత్తం పదిహేనుసార్లు ఇలా మాట మాటకూ అడ్డొచ్చారు. నాపై వారు చేసినవన్నీ వ్యక్తిగత ఆరోపణలే... అన్నీ అబద్ధాలతో కూడుకున్నవే! నాపై వాళ్లు (అధికారపక్షం) చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. వాటిని నిరూపించక పోతే పదవులకు రాజీనామా చేస్తారా? అని నేను విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించే ధైర్యం వాళ్లకు లేదు.
ఏ చర్చ చూసినా పక్కదోవ పట్టించడమే!
అసెంబ్లీలో మేము ఏ అంశాన్ని లేవనెత్తినా దానిపై చర్చను అధికారపక్షం పక్కదోవ పట్టిస్తోంది. అక్వా పార్కు కాలుష్యం వల్ల చనిపోయిన బాధితుల సమస్యపై ఇవాళ చర్చ ఎలా జరిగిందో చూశారు కదా ! అక్వా పార్కు ఇబ్బందులు, నష్టాలను సభలో మేం చెప్పాం. దానిని అక్కడి నుంచి తరలించి సముద్ర తీరం దగ్గరికి తీసుకు వెళ్లండి అని మేం విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరూ చూశారు. ఇదొక్కటే కాదు, అధికారులపై టీడీపీ నేతలు గతంలో దాడి చేసిన ఉదంతం, దాని కన్నా ముందు అగ్రిగోల్డ్ కుంభకోణం, పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహారం ఇలా... ఏ అంశంపై చూసినా ప్రభుత్వ వైఖరి ఒకే విధంగా కనిపిస్తోంది. తప్పించుకోవడం.... అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడం... ఏ అంశంపై కూడా సీబీఐ విచారణకు టీడీపీ ప్రభుత్వం సిద్ధపడలేదు. అగ్రిగోల్డ్ విషయంలో సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని కోరాం, కానీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అగ్రిగోల్డ్‌కు చెందిన బయట ఉన్న ఇంకా కొన్ని ఆస్తులను కూడా వేలం పరిధిలోకి తీసుకు రావాలని కోరితే ప్రభుత్వం దాన్నీ ఒప్పుకోలేదు. అసలు ప్రతిపక్షం లేవనెత్తే ప్రజా సమస్యలను వినాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేకుండా పోతుంది.
అధికారపక్షానికి జగనే ఒక సమస్య
ప్రతిపక్షంగా మాకేమో ప్రజా సమస్యలే మాకు సమస్యలు... కానీ అధికారపక్షానికి జగనే ఒక సమస్య, అన్నట్లుగా వ్యవహరించారు. మేం ప్రజా సమస్యలపై మాట్లాడితే వారు (టీడీపీ) మాత్రం జగనే మా సమస్య అని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని కోరుతూ తీర్మానం చేయించేందుకు మేం పడ్డ ఆరాటం, తపనను చంద్రబాబునాయుడు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. తాను ప్రత్యేక హోదాకు వ్యతిరేకిని అని చంద్రబాబు ఈ సమావేశాల్లో స్పష్టంగా బయట పడ్డారు. మా పార్టీ నుంచి ఎన్నికైన 21 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చంద్రబాబు కండువాలు కప్పి తీసుకెళ్లారు. స్పీకర్ సమక్షంలోనే సభలో ఫిరాయింపు ఎమ్మెల్యేలందరినీ టీడీపీ బెంచీల వైపు కూర్చోబెట్టి సభను నడిపిన తీరు ఈ సమావేశాల్లో చూశాం. ఇంత దారుణంగా ప్రజా స్వామ్య విలువలను ఖూనీ చేశారు. ఆ దేవుడు, ప్రజలు చూసుకుంటారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కనుక చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే పైన దేవుడున్నాడు...అంతిమంగా గుణపాఠం నేర్పడానికి ప్రజలున్నారు. వారే తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం వరుసగా అన్యాయాలు చేసుకుంటూ పోతూంటే మేం ఏం చేయగలం.
వ్యవసాయ రుణ విముక్తిపై అబద్ధాలు, మోసాలు
వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. ఈ నివేదిక పూర్తి వివరాల్లోకి నేనింకా వెళ్లలేదు. వ్యవసాయ రుణాల విముక్తి అంశం చాలా ముఖ్యమైంది కనుక చూశాను (కాగ్ నివేదిక చూపుతూ....) 2015–16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణ విముక్తికి రూ 4300 కోట్లు కేటాయించింది. అందులో రూ 743 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగిలిన రూ 3557 కోట్ల మొత్తాన్ని ఇతర పద్దులకు రీ అప్రాప్రియేషన్ చేశారు. ఇక ఉద్యానవన పంటల రుణ విముక్తి కోసం 2015–16లో నిధులేమీ కేటాయించలేదు. రూ 743 కోట్ల మొత్తంలో కూడా రూ 375 కోట్ల నిధులను సంవత్సరం చివర్లో రైతు సాధికార సంస్థ పీడీ ఖాతాకు సర్దుబాటు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.
ఈ నిధులు రైతులు, మహిళాస్వయంసహాయక బృందాలు, చేనేత మరమగ్గాలు, నేత కార్మికులకు ఇచ్చిన రుణాల విముక్తికి ఉద్దేశించినవి కాబట్టి , కార్య నిర్వాహక శాఖలు వీటిని అనుకున్న వ్యవధిలో కేటాయించిన ప్రయోజనం కోసం ఖర్చు చేయలేక సంవత్సరం చివర్లో నిధులను బ్యాంకుల్లో జమ చేశాయి అని కాగ్ పేర్కొంది. అంటే 2015–16లో రూ 4300 కోట్లు రుణ విముక్తికి కేటాయిస్తే అందులో రూ 743 కోట్లు మాత్రమే వ్యవసాయ రుణ విముక్తి పథకం కోసం ఖర్చు చేసినట్లు మిగతా రూ 3557 కోట్లను ఇతర పద్దులకు రీ అప్రాప్రియేషన్ చేసినట్లు కాగ్ నివేదిక చూపుతూ... ఇంత దారుణంగా అబద్ధాలాడుతూ మోసాలు చేస్తున్నారు.
పట్టిసీమలో అవినీతి
పట్టిసీమ ప్రాజెక్టు ఒక అవసరం లేని ప్రాజెక్టు అని కాగ్ పేర్కొంది. ఈ ప్రాజెక్టులో దాదాపు రూ 350 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా , ఒక ప్రతికూలమైన ప్రాజెక్టుగా వ్యాఖ్యానించింది. జగన్‌తో పాటుగా ఆయన రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్.కె.రోజా, గిడ్డి ఈశ్వరి, వంతెల రాజేశ్వరి, పి.అనిల్‌కుమార్ యాదవ్, కొడాలి నాని, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, జంకె వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.