ఉపాధి 'కియా' | YS Jagan Mohan Reddy Launch Kia Motors in Anantapur | Sakshi
Sakshi News home page

ఉపాధి కియా

Published Fri, Dec 6 2019 10:53 AM | Last Updated on Fri, Dec 6 2019 10:53 AM

YS Jagan Mohan Reddy Launch Kia Motors in Anantapur - Sakshi

కియా గ్లోబల్‌ సీఈఓ హాన్‌ వూ పార్క్‌తో కలిసి కారులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

కియా ప్రాంగణం నిండైనా తెలుగుదనంతో వెలుగులీనింది. సంప్రదాయనృత్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. యంగ్‌ అండ్‌ డైనమిక్‌ సీఎం అంటూ కియా ప్రతినిధులు కీర్తించారు. కియా గ్రాండ్‌ ఓపెనింగ్‌ సెర్మనీలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. సెల్టోస్‌ కారుపై ఆటోగ్రాఫ్‌ చేశారు. ఆ తర్వాత బ్యాటరీ కారులో కియా ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి అవకాశాలకు కియా పరిశ్రమతో ద్వారాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. ఎప్పటిలాగే వైఎస్‌ జగన్‌ రాక అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. దారిపొడవునా జై జగన్‌ నినాదం హోరెత్తింది.

అనంతపురం: పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని.. కియా మోటార్స్‌లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగితే మరిన్ని ఉద్యోగాలు జిల్లావాసులకు దక్కుతాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. కియా మోటార్స్‌ ఏర్పాటు చేసిన భారీ      ప్రారంభోత్సవ కార్యక్రమానికి (గ్రాండ్‌ ఓపెనింగ్‌ సెర్మనీ) సీఎం జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. గన్నవరంవిమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం 10.52 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు శ్రీధర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కలెక్టర్‌ గంధం చంద్రుడు, డీఐజీ కాంతిరాణా టాటా, సత్యసాయి ట్రస్ట్‌ ప్రతినిధులు రత్నాకర్, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ మెహతా, కదిరి ఆర్డీఓ రామసుబ్బయ్య, ఎస్కేయూ వీసీ జయరాజ్, అఖిలభారత చేనేత బోర్డు ప్రతినిధి కేఎన్‌మూర్తి, స్థానిక నాయకులు సోమశేఖర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి శంకరనారాయణ, కలెక్టర్‌ గంధం చంద్రుడు ఉన్నారు. కియా మోటార్స్‌ కార్ల తయారీ యూనిట్‌లోని అన్ని విభాగాలను ఈ సందర్భంగా సీఎం సందర్శించారు. అనంతరం సభలో ప్రసంగించారు. సభ అనంతరం తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ బయలుదేరి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఉన్నారు. స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీచరణ్, జొన్నలగడ్డ పద్మావతి, వై.వెంకటరామిరెడ్డి, సిద్ధారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీలు ఇక్బాల్, వెన్నపూస గోపాల్‌రెడ్డి.. ప్రాథమిక విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి ఉన్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, గురునాథరెడ్డి, వైటీ ప్రభాకర్‌రెడ్డి, మాజీమంత్రి షాకీర్, రిటైర్డ్‌ జడ్జి కిష్టప్ప, అనంతపురం, హిందూపురం పార్లమెంటు అ«ధ్యక్షులు నదీంఅహమ్మద్, నవీన్‌నిశ్చల్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement