వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు.
హైదరాబాద్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. వైఎస్‌ఆర్ సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఏపీ మంత్రి వర్గంలో చోటు కల్పించడంపై ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి పదవులు పొందిన నలుగురు అధికారికంగా వైఎస్‌ఆర్ సీపీలోనే ఉన్నారని వైఎస్ జగన్ ...గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేయడంతో రాజ్యాంగాన్ని కాలరాయడమే అని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గవర్నర్ కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావుకు ఏపీ మంత్రివర్గంలో స్థానం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, పార్టీ ఫిరాయించినవారికి మంత్రి పదవులు ఎలా ఇస్తారని వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ వెంట పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, బాలనాగిరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఉన్నారు.