చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్
హైదరాబాద్ : విద్యుత్ లెక్కలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై చంద్రబాబుతో తాను చర్చకు సిద్ధమన్నారు. ఆయన చెప్పిన లెక్కలు తప్పని తాను నిరూపిస్తే.. చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
అసెంబ్లీలో మంగళవారం విద్యుత్ ఛార్జీల పెంపుపై చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బొగ్గు రేట్లు 102 డాలర్ల నుంచి 60 డాలర్లకు తగ్గాయని, అలాంటప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరమే లేదన్నారు. చార్జీల పెంపులో హేతుబద్ధత లేదని, కేంద్రం అదనపు విద్యుత్ ఇస్తుంటే విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారని వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు. ఏ రాష్ట్రంలోనూ లేని విద్యుత్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాల బకాయిలను కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి రద్దు చేశారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.