
విశాఖ మహాధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్
వచ్చే నెల 5న విశాఖపట్నంలో జరిగే మహాధర్నాలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని వైఎస్సార్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు డిసెంబర్ 5న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహించనుంది. విశాఖపట్నంలో జరిగే మహాధర్నాలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని వైఎస్సార్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లా నేతలతో సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాజధాని భూముల వ్యవహారంపై రైతుల అభిప్రాయాలను వైఎస్ జగన్ కు వివరించినట్టు ఆయన తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పర్యటించిందని తెలిపారు. మిగిలిన గ్రామాల పర్యటన పూర్తైన తర్వాత వైఎస్ జగన్ కు నివేదిక ఇస్తామని చెప్పారు. అవసరాన్ని బట్టి అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసే విషయం కూడా చర్చించామన్నారు.