
సాక్షి, ఇడుపులపాయ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్ విగ్రహానికి కూడా పూలమాల వేసి అంజలి ఘటించారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిసిన తర్వాత వైఎస్ జగన్.. నేరుగా ఇడుపులపాయకు వెళ్లారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద కాసేపు గడిపారు.
మరికాసేపట్లో వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఈ సాయంత్రం వైఎస్ జగన్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలవనుంది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ దృష్టికి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తీసుకెళ్లనుంది.