ఇసుక తవ్వకాలు, రవాణాపై సీఎం జగన్‌ సమీక్ష | YS Jagan Mohan Reddy Review Meeting On Sand Transportation | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాలు, రవాణాపై సీఎం జగన్‌ సమీక్ష

Published Wed, Oct 23 2019 11:06 PM | Last Updated on Wed, Oct 23 2019 11:22 PM

YS Jagan Mohan Reddy Review Meeting On Sand Transportation - Sakshi

సాక్షి, అమరావతి: ఇసుక వినియోగదారులు తమ వ్యక్తిగత అవసరాలకు మించి ఇసుకను నిల్వచేయడానికి వీల్లేదని.. నిల్వచేసే వ్యక్తులపై గ్రామ సచివాలయమే తగిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇసుక కొరతపై  సచివాలయంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో  ఈ మేరకు సీఎం వ్యాఖ్యానించారు.  3 నెలల కాలానికి ఇసుక తవ్వకాలు, రవాణాపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇసుక లభ్యత, డిమాండ్‌పై అధికారుల నుంచి సీఎం వివరాలు తెలుసుకున్నారు. నదుల్లో ప్రవాహాలు తగ్గకపోవడం వల్ల ఇసుక కొరత ఏర్పడిందన్న అధికారులు 55 రోజలు నుంచి గోదావరి, 71 రోజుల నుంచి కృష్ణానది పొంగి ప్రవహిస్తున్నాయని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 400–500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని, వంశధార, పెన్నా నదుల్లో కూడా కొనసాగుతున్న వరద ప్రవాహం, మరోవైపు భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయిని తెలిపారు.

ఫలితంగా ఇసుక లభ్యత ఉండే ప్రాంతాల నుంచి తవ్వకాలు చేయలేకపోతున్నామని సీఎంకు తెలియజేశారు. ఇసుక రీచ్‌ల వద్దకు వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని నివేదించిన అధికారులు 200కుపైగా రీచ్‌లను గుర్తిస్తే ప్రస్తుతం 69 చోట్లనుంచే వెలికి తీయగలుగుతున్నామని అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రధాన నదుల్లో ప్రవాహాలు తగ్గకుంటే.. ఎక్కడ సాధ్యమవుతుందో, ఆయా ప్రాంతాలను గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామ సెక్రటేరియట్‌ల ద్వారా జరిగితే... అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని సీఎం అన్నారు. ఈ విషయంలో గ్రామసచివాలయాలను సమర్థవంతంగా వాడుకోవాలన్న సీఎం.. 3 నెలల కాలానికి ఎలాంటి విధానాలు అనుసరించాలన్న దానిపై సమావేశంలో విస్తృత‍ంగా చర్చించారు. అవినీతి లేకుండా, పర్యావరణానికి నష్టం రాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. 

3 నెలల కాలానికి ఇసుక తవ్వకాలు, రవాణాపై తాజా మార్గదర్శకాలు:
ఇసుక లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన నదుల్లో ప్రవాహాలు తగ్గకపోవడంతో అందుబాటులో ఉన్న వాగులూ, వంకలూ, నదుల్లో ఇసుక లభ్యతను గుర్తించాలని ఆదేశించారు. ఈ మేరకు గ్రామాల వారీగా గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు. కీలక మార్గదర్శకాలు.. ‘రీచ్‌ల్లో పర్యవేక్షణ గ్రామవాలంటీర్‌కు అప్పగించనున్న గ్రామ సచివాలయం. రవాణా చేస్తున్న వాహనాలు, తరలిస్తున్న పరిమాణంపై రికార్డు చేయనున్న వాలంటీర్‌.  ఏపీ వాల్టా చట్టానికి అనుగుణంగా తవ్వకాలు జరిగేలా సమన్వయపరచనున్న ఏపీఎండీసీ. రవాణా చేస్తున్న వాహనానికి ఎస్‌–3 ఫాంను జారీచేయనున్న గ్రామ సెక్రటేరియట్‌ ఇన్‌ఛార్జి, డూప్లికేట్‌ రశీదు మాత్రమే ఇవ్వనున్న గ్రామ సచివాలయ ఇన్‌ఛార్జి.

ఈ ఫాంను వాడినా, వాడకున్నా కాలపరిమితి 48 గంటలే ఉంటుంది. వాడకపోయినా డబ్బు తిరిగి చెల్లించరు. తిరిగి వాడుకునేందుకూ వీలుకాదు. ఇసుక రవాణాచేస్తున్న ట్రాక్టర్లకు 20 కి.మీ వరకే అనుమతి ఉంటుంది. వాణిజ్య అవసరాలకు కాకుండా స్థానిక అవసరాలకు ఈ ఇసుక వినియోగించాలని షరతు విధిస్తారు. ఏపీ వాల్టా చట్టం ప్రకారం ఇసుక తవ్వకాల్లో ఎలాంటి యంత్రాలను వినియోగించరాదు. కేవలం మానవ వనరులను మాత్రమే వినియోగించాలి. సరఫరా చేస్తున్న ఇసుకకు సంబంధించి వినియోగాన్ని గ్రామ సచివాలయమే పరిశీలించాలి. ఇసుక లభ్యత కోసం తీసుకున్న పై తాజా నిర్ణయాలు 3 నెలల కాలం వరకే అమలవుతాయి. తర్వాత సమీక్షించి తదుపరి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలను ఆయా జిల్లా కలెక్టర్లు విస్తృతంగా ప్రచారం చేయాలి’ అంటూ కీలక మార్గదర్శకాలను జారీచేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement