
నేడు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వచ్చి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో ఆయన నరసాపురం చేరుకుంటారు. ఈలోపు గన్నవరం రోటరీ క్లబ్బులో వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
శుక్రవారం సాయంత్రం నరసాపురం స్టీమర్ రోడ్డులో వైఎస్ఆర్ జనభేరి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నరసాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నాయకులు కూడా పార్టీలో చేరనున్నట్లు సమాచారం.