
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: దివంగత మహానేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని విజయవాడ నగరంలో సోమవారం ఆవిష్కరిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలోని ప్రగతి పార్కును డాక్టర్ వైఎస్సార్ పార్కుగా నామకరణం చేశారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల అయ్యాయని చెప్పారు.
ప్రగతి పార్కు వద్ద గతంలో వైఎస్సార్ విగ్రహం ఉండేదని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దాన్ని తొలగించారన్నారు. అదే కూడలిలో అదే విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ప్రజలు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, పార్టీ శ్రేణులు హాజరు కావాలని కోరారు. కాగా, అన్ని అనుమతులతో 2011లో విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం వద్ద పోలవరం ప్రాజెక్టు ప్రతిమపై వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం రాజకీయ కారణాలతో టీడీపీ ప్రభుత్వం గత కృష్ణా పుష్కరాల సమయంలో 2016 జూలై 31వ తేదీ అర్ధరాత్రి పోలీసు బందోబస్తు మధ్య ఆ విగ్రహాన్ని తొలగించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో అన్ని అనుమతులతో విగ్రహ పునఃప్రతిష్ట జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment