సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో భాగం గా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థనను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఆయన పిటిషన్‌ను న్యాయమూర్తి ఎంవీ రమేష్ సోమవారం కొట్టివేశారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో తిరిగేందుకు, ఎంపీగా విధులు నిర్వహించేందుకు, జాతీయపార్టీల నేతలను కలవడానికి ఢిల్లీకి వెళ్లేందుకు ఇప్పటికే అనుమతించాం. ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు జగన్ పేర్కొన్న కారణం సాధారణమైనది. కేంద్రం ఎటువంటి ఎన్నికల నోటిఫికేషన్‌నూ జారీచేయలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కూడా కాదు.
ఈ నేపథ్యంలో బెయిల్ షరతులను పూర్తిగా సడలించలేం. ఇది ప్రీమెచ్యూర్ పిటిషన్’’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఏ రాష్ట్రానికి వెళ్లేదీ స్పష్టం చేస్తూ వేరుగా పిటిషన్ దాఖలు చేస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని బుధవారం కోల్‌కతాలో కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని, ఈ మేరకు అనుమతించాలని కోరుతూ వైఎస్ జగన్ సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి... సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అప్పటికప్పుడు హైదరాబాద్ విడిచి వెళ్లాల్సి ఉంటుం ద ని, రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలన్న షరతును సడలించాలన్న జగన్ అభ్యర్థనను కోర్టు అనుమతించింది. నగరం విడిచే రోజునే కోర్టుకు సమాచారం ఇవ్వాలని న్యాయమూర్తి ఎంవీ రమేష్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
లేపాక్షి చార్జిషీట్‌లో కోర్టుకు జగన్ హాజరు
లేపాక్షి నాలెడ్జి హబ్‌పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, ఇందూ సంస్థల అధినేత శ్యాంప్రసాద్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, బి.శ్యాంబాబు, ఎం.శామ్యూల్, మురళీధర్‌రెడ్డి, లేపాక్షి నాలెడ్జి హబ్ ఎండీ శ్రీనివాస్ బాలాజీ, బెంగళూరుకు చెందిన బి.ప్రభాకర్‌రెడ్డి, కుమారబాబు కూడా కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు నిర్దేశించిన మేరకు వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించారు. అలాగే లేపాక్షినాలెడ్జి హబ్, ఇందూ ప్రాజెక్టుల తరఫున శ్యాంప్రసాద్‌రెడ్డి పూచీ కత్తు బాండ్లను సమర్పించారు. పూచీకత్తు బాండ్లను ఆమోదించిన రెండో అదనపు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంవీ రమేష్... కేసు విచారణకు క్రమం తప్పకుండా నిందితులు హాజరుకావాలని స్పష్టం చేస్తూ విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేశారు. కాగా, రాష్ట్రవిభజనకు సంబంధించి జీవోఎంతో భేటీ కారణంగా మంత్రిగీతారెడ్డి, తనపై పీసీయాక్టు అభియోగాలకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున హాజరు కాలేకపోతున్నానంటూ మాజీ మంత్రి ధర్మాన హాజరు మినహాయింపు కోరారు. ఈ మేరకు వారి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి అనుమతించారు. తదుపరి విచారణ రోజున పూచీకత్తు బాండ్లను సమర్పించాలని షరతు విధించారు.
జగన్ ఇతర రాష్ట్రాల పర్యటనకు నో
Published Tue, Nov 19 2013 3:26 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement