నేటి నుంచి జగన్‌ రైతు దీక్ష | YS Jagan To Launch Rythu Deeksha On May 1 And 2 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జగన్‌ రైతు దీక్ష

Published Mon, May 1 2017 12:58 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

నేటి నుంచి జగన్‌ రైతు దీక్ష - Sakshi

నేటి నుంచి జగన్‌ రైతు దీక్ష

అన్నదాతలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రెండురోజుల దీక్ష
ఎన్నికల సమయంలో రైతన్నలకు చంద్రబాబు హామీలు
వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానన్న బాబు
పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఉద్ఘాటన  
బాబు అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు అన్నీ కష్టాలే
మాఫీ కాని రుణాలు.. పంటకు దక్కని మద్దతు ధరలు


సాక్షి, అమరావతి: పంట రుణాలు మాఫీ కాక, పండించిన పంటలకు మద్దతు ధరల్లేక కష్టాలు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఏమాత్రం ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి రెండు రోజులపాటు ‘రైతు దీక్ష’ చేపట్టనున్నారు. రుణమాఫీ హామీకి ముఖ్యమంత్రి పాతర అన్నదాతల ఆక్రోశాన్ని ఎలుగెత్తి చాటి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వైఎస్‌ జగన్‌ రైతు దీక్షకు పూనుకుంటున్నారు.

 ప్రతికూల పరిస్థితుల్లో నూ ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి, పసుపు, ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలకు కనీస మద్దతు ధరలు లభించక రైతన్నలు ఆర్థికంగా దిగజారిపోతున్నారు. పంటల సాగు కోసం బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను బేషర తుగా మాఫీ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కాక ఆ హామీకి పాతరేశారు. మూడేళ్లుగా రుణాలను మాఫీ చేయకుండా రైతాంగాన్ని వెన్నుపోటు పొడిచారు.

వర్షాభావ పరిస్థితులను ఎదిరించి, కష్టపడి పండించిన పంటలను మార్కెట్‌ యార్డులకు తరలిస్తే మద్దతు ధరలు దక్కడం లేదు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వమేమో చోద్యం చూస్తోంది. మద్దతు ధర కల్పించి రైతన్నల్లో భరోసా పెంచాల్సింది పోయి కుంటిసాకులతో కాలం గడుపుతోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ‘ధరల స్థిరీకరణ నిధి’కి ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లొదిలేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రైతు దీక్ష తలపెట్టారు. ఈ దీక్షతోనైనా ప్రభుత్వంలో చలనం వచ్చి, తమను ఆదుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు బస్టాండ్‌ సెంటర్‌లో మేడే పతాకావిష్కరణ
వైఎస్‌ జగన్‌ సోమవారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు గుంటూరు బస్టాండ్‌ సెంటర్‌కు చేరుకుంటారని చెప్పారు. అక్కడ నిర్వహించే కార్మిక దినోత్సవంలో పాల్గొని పతాకావిష్కరణ చేస్తారని వెల్లడించారు.

అనంతరం దీక్షా స్థలికి వస్తారని వివరించారు. జగన్‌ సోమవారం ఉదయం 10.30 గంటలకు రైతు దీక్షకు శ్రీకారం చుట్టనున్నారు. రైతు దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలో ప్రైవేటు ప్రాంగణంలో దీక్ష జరగనుంది. ప్రధాన వేదిక, రైతన్నల కడగండ్లపై కళాకారుల ప్రదర్శనకు మరో వేదిక నిర్మాణం పూర్తయ్యాయి. పార్టీ ముఖ్యులు, రైతులు, ప్రజలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement