మనుషుల ప్రాణాలకంటే ముఖ్యమైనదేముంది?
అసెంబ్లీలో అధికారపక్షాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ‘‘రాష్ట్రంలో మనుషుల ప్రాణాలకంటే ముఖ్యమైనవి ఏమీ లేవు. అందుకే శాంతిభద్రతల సమస్యపై చర్చ జరగాలని పట్టుబడుతున్నాం’’ అని శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం శాంతిభద్రతలపై చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘శాంతిభద్రతల సమస్యపై ఈరోజే చర్చ జరగాలి. బుధవారం దీనిపై అవకాశమిస్తామని చెబుతున్నారు. బుధవారం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌లో మీరు కేటాయింపులు చేసే అంశాలనుబట్టి నిలదీయాల్సి ఉంటుంది. ఈ రెండ్రోజుల్లో మనుషుల ప్రాణాలకంటే ముఖ్యమైన చర్చలు ఏమున్నాయి? సూటిగా ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడగదల్చుకున్నా.. తెలుగుదేశం ప్రభుత్వం అదికారంలోకి వచ్చి మూణ్నెళ్లయింది. ఈ మూడు నెలల్లో జరిగిన హత్యల గురించే అడుగుతున్నాను. గత చరిత్ర గురించి మాట్లాడటంలేదు. వంగవీటి రంగాను చంపిన విషయం గురించి మాట్లాడలేదు. ప్రజల సమస్యలపై చర్చకు ఎందుకు అవకాశమివ్వరు’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.