దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ
హత్యా రాజకీయాలపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్‌సీపీ
శాంతిభద్రతల సమస్యపై వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
స్పీకర్ తిరస్కరణ.. విపక్ష సభ్యుల తీవ్ర నిరసన.. చర్చకు పట్టు
ముందుగా నోటీసు ఇస్తే సభలో చర్చకు అనుమతిస్తానన్న స్పీకర్
సభలో తొలి రోజు తీవ్ర గందరగోళం.. నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హత్యా రాజకీయాలు, క్షీణిస్తున్న శాంతిభద్రతలపై చర్చించాలంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానం మీద చర్చకు పట్టుపడుతూ ఆ పార్టీ సభ్యులు చేసిన నినాదాలతో బడ్జెట్ సమావేశాల తొలి రోజు శాసనసభ హోరెత్తింది. సోమవారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే.. శాంతిభద్రతల సమస్యపై వైఎస్సార్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. స్పీకర్ నిర్ణయాన్ని అంగీకరించని ప్రతిపక్ష సభ్యులు.. తమ వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుపట్టారు. ప్లకార్డులు చేతపట్టుకొని స్పీకర్ పోడియం ముందున్న వెల్‌లోకి దూసుకెళ్లారు. ‘వియ్ వాంట్ జస్టిస్ (మాకు న్యాయం కావాలి)’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరస్కరించిన వాయిదా తీర్మానం మీద చర్చకు అనుమతించడం సాధ్యం కాదని, మరో రూపంలో ముందుగా నోటీస్ ఇస్తే చర్చించడానికి తనకు అభ్యంతరం లేదని స్పీకర్ పేర్కొన్నారు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు చేస్తున్న నినాదాలుగా పోటీగా అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి ప్రతి నినాదాలు చేశారు. ‘వియ్ వాంట్ క్వశ్చన్ అవర్ (మాకు ప్రశ్నోత్తరాలు కావాలి)’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరు పక్షాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ‘మమ్మల్ని కూర్చోవాలని పదే పదే చెప్తున్న మీరు.. టీడీపీ సభ్యులు కూడా నినాదాలు చేస్తున్నా వారిని కూర్చోవాలని చెప్పడం లేదు’ అని వైఎస్సార్ సీపీ సభ్యులు స్పీకర్‌ను ప్రశ్నించారు. వెంటనే స్పందించిన స్పీకర్.. టీడీపీ సభ్యులకు కూడా కూర్చోవాలని చెప్పారు. స్పీకర్ సూచన మేరకు టీడీపీ సభ్యులు తమ స్థానాల్లో కూర్చున్నారు. వైఎస్సార్ సీపీ సభ్యులు వాయిదా తీర్మానం మీద చర్చ జరగాల్సిందేనంటూ గట్టిగా పట్టుపట్టారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు హోరు తారా స్థాయికి చేరడంతో ఉదయం 9.35 గంటలకు సభను 15 నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు. తిరిగి 10.25 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడూ పరిస్థితిలో మార్పు రాలేదు. సభ సజావుగా సాగడానికి సహకరించాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేశారు. గత పది సంవత్సరాలుగా హత్యలు చేయించిన వారు ఇప్పుడు సభలో చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు.
11 మందిని అతి కిరాతకంగా చంపారు: వైఎస్ జగన్
వాయిదా తీర్మానం మీద చర్చ కోసం వైఎస్సార్ సీపీ పట్టుబట్టినప్పుడు.. శాంతిభద్రతల అంశాన్ని ప్రస్తావించడానికి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. ‘అత్యంత ముఖ్యమైన, ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్న అంశం మీద వాయిదా తీర్మానం ఇస్తాం. గత 3 నెలల్లో 11 మందిని అతి కిరాతకంగా చంపారు. ఏం చర్యలు తీసుకున్నారని అడిగితే.. సమాధానం చెప్పే పరిస్థితి లేదు. 119 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబాల పరామర్శకు వెళితే.. ఆయా కుటుంబాలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నాయి. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా?’ అని జగన్ ప్రశ్నించారు.
జగన్ ప్రసంగం కొనసాగిస్తుండగా.. కేవలం ప్రస్తావన చేయడానికే అవకాశం ఇచ్చానని, చర్చ, ప్రసంగం చేయకూడదంటూ స్పీకర్ అడ్డుపడ్డారు. ‘శాంతిభద్రతల సమస్యపై చర్చ చేయడం అసమంజసం అని నేను అనడం లేదు. కానీ అజెండాను పక్కనబెట్టి వాయిదా తీర్మానం చేపట్టాల్సిన అవసరం లేదని అంటున్నా. మరో రూపంలో సభ ముందకు తీసుకురండి. చర్చకు అనుమతిస్తాను’ అని స్పీకర్ పేర్కొన్నారు. కానీ వైఎస్సార్ సీసీ సభ్యులు చర్చ జరగాలంటూ పట్టువీడలేదు. మళ్లీ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయడం ప్రారంభించారు. దాంతో స్పీకర్ సభను రెండోసారి 10.45 గంటలకు 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. 11 గంటలకు తిరిగి ప్రాంభమైనప్పుడూ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.