ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు జగన్, విజయమ్మ రాజీనామా
అందరికీ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచండి
విభజనకు ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు?
అధికారం ఉందని కోట్లాది తెలుగువారి జీవితాలతో ఆటలాడతారా?
హైదరాబాద్ సంగతేమిటి.. సాగునీటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారు?
మీ నిరంకుశ వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నాం
వైఎస్ జగన్, విజయమ్మ బహిరంగ లేఖ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తమ ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు శనివారం రాజీనామా చేశారు. జగన్ కడప లోక్‌సభ స్థానానికి తాను చేసిన రాజీనామాను జైలు అధికారుల ద్వారా లోక్‌సభ స్పీకర్‌కు ఫ్యాక్స్‌లో పంపించారు. విజయమ్మ పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు పంపించారు. వారిద్దరూ స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖలు పంపారు. ఈ సందర్భంగా జగన్, విజయమ్మ బహిరంగ లేఖ విడుదల చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు నియంతృత్వ పోకడతో విభజన నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినందుకు నిరసనగా పదవులకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల జరిగే కష్టనష్టాలను బేరీజు వేసుకోకుండా సమస్యను కాంగ్రెస్ పార్టీ మరింత జటిలం చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో అధికారాన్ని చలాయిస్తున్న వారు అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేయలేని పరిస్థితి ఉంటే రాష్ట్రాన్ని యథాతథంగా వదిలేయాలని డిమాండ్ చేశారు. ‘‘కేంద్రం ముందుగా తన వైఖరిని ఇక్కడి పార్టీల ముందుంచి, ఆ తర్వాత అన్ని ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ అన్యాయం జరగకుండా నిర్ణయం తీసుకోవాలని మేం పదేపదే విజ్ఞప్తి చేశాం. అయినా కాంగ్రెస్ అలాంటి వాతావరణాన్ని కల్పించలేదు. పైగా ఈ రోజు పరిస్థితి చూస్తుంటే, నెత్తిన తుపాకీ పెట్టి ‘ఒప్పుకుంటారా... చస్తారా?’ అని కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరిస్తున్నట్టుగా ఉంది. సీట్లు, ఓట్ల కోసం కాంగ్రెస్ చేస్తున్న అనాలోచిత విభజన రాజకీయం వల్ల వచ్చే సమస్యలేమిటో అందరికీ తెలిసేలా మరోసారి చెప్పకపోతే కోట్లాది మందికి తరతరాల పాటు అన్యాయం జరిగిపోతుందేమోననే భావనతో మా పదవులకు రాజీనామా చేస్తున్నాం’’ అని వివరించారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్నవారు కళ్లు తెరవాలని జగన్, విజయమ్మ సూచించారు. రాష్ట్ర విభజన తప్పదని కేంద్రం భావిస్తే, తెలుగు ప్రజలను విభజించడం కంటే వేరే దారి లేదని వారనుకుంటే... ఒక రాజకీయ నాయకుడు తన వ్యక్తిగత లాభాల కోసమో... ఒక పార్టీ రాజకీయ లాభాల కోసమో... రాజకీయ కోణాలతోనో ఆ పని చేయకూడదన్నారు. తెలంగాణ అనేది... కేంద్ర ప్రభుత్వం ఒక తండ్రిలా, ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా, ఇరు ప్రాంతాలు అన్నదమ్ముల్లా ఇకముందు కూడా ఎప్పుడూ కలిసుండేలా పంపకాలు చేయాల్సిన సున్నితమైన అంశమని పేర్కొన్నారు. అలా అందరికీ న్యాయం చేయకపోతే, కేంద్రంలో అధికారం చలాయిస్తున్నవారు రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోనే కూడదనివారు కుండబద్దలు కొట్టారు. ‘‘రాష్ట్రంలో వివిధ ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని, ఆ తర్వాత మార్పుచేర్పులను, ఆయా ప్రాంతాల అవసరాలను, ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా పరిష్కారం చూపాలి. ప్రధానంగా నీటి సమస్య, హైదరాబాద్ అంశాలపై పరిష్కారం కావాలి’’ అని లేఖలో కోరారు.రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం రాష్ట్ర విభజనకు సంబంధించి సర్వాధికారాలూ కేంద్ర ప్రభుత్వానికే ఉన్న నేపథ్యంలో, ఆ అధికారం సాయంతో రాష్ట్రంలోని కోట్లాది మంది జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. అందరికీ న్యాయం చేయలేకపోతే విడగొట్టే అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇక్కడి ప్రజల స్థానంలో ఉండి ఆలోచించాలని సూచించారు. తమ రాజీనామాలకు దారి తీసిన అంశాలను వివరిస్తూ రాసిన 7 పేజీల బహిరంగ లేఖను జగన్, విజయమ్మ పత్రికలకు విడుదల చేశారు.