అభివృద్ధికి అచ్చమైన రూపకర్త.. మహానేత! | ys rajasekhara reddy development in srikakulam district | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి అచ్చమైన రూపకర్త.. మహానేత!

Published Sun, Sep 2 2018 7:53 AM | Last Updated on Sun, Sep 2 2018 7:53 AM

ys rajasekhara reddy development in srikakulam district  - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అభివృద్ధి అంటే? కాగితాలపై ప్రతిపాదనలు కాదు. అమలుకాని మ్యానిఫెస్టో హామీలు కాదు. ప్రజలకు చెప్పీచెప్పీ అరిగిపోయిన రికార్డులు కాదు. అభివృద్ధి అంటే.. అన్నదాతకు అక్కరకొచ్చేలా సాగునీరు. రోగమేదైనా అందుబాటులోని ఆధునిక వైద్యం. ప్రతి విద్యార్థీ చదువుకునేలా ఉన్నత విద్య. ఒక కుటుంబానికి ఈ మూడూ అందితే ఎన్నికల తాయిలాలు అక్కర్లేదు. ఆ కుటుంబమే ఆర్థికంగా నిలబడుతుంది. అలా కుటుంబాలన్నీ బాగుంటే సమాజమే బాగుంటుంది. అలా సమాజం బాగుంటే అభివృద్ధి దానికదే అడుగులేసుకుంటూ వస్తుంది. ఇదీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆచరించి చూపించిన సిద్ధాంతం. ఎక్కడో దూరాన ఉందని వదిలేసే నాయకులకు భిన్నంగా ప్రతి సంక్షేమ పథకంలోనూ సిక్కోలుకు పెద్దపీట వేసి ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత. ఆయన తొమ్మిదో వర్ధంతి నేడు.

జిల్లాలో విద్య, వైద్యం, సాగునీరు, సంక్షే మం.. ఇలా ఏ రంగంలో చూసినా వైఎస్సార్‌ ముద్ర కనిపిస్తుంది. 2009 సెప్టెంబరు 2న ఆయన అకాల మరణం రాష్ట్రానికే కాదు వెనుకబడిన సిక్కోలు జిల్లాకు పెద్ద లోటు. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలా నీరుగారిపోతున్నాయో అందరికీ తెలిసిందే. ఆదివారం ఆయన తొమ్మిదో వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ అడుగుజాడలను మరోసారి స్మరించుకుందాం.

అన్నదాతలకు ఆపద్బాంధవుడిగా...
బ్యాంకు రుణం అంటేనే సవాలక్ష ఆంక్షలమయంగా మారిపోతున్న ఈ రోజుల్లో రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అసలు వాయిదా పద్ధతే లేకుండా ఏకమొత్తంలో రైతన్నల బ్యాంకు రుణాలన్నీ మాఫీ చేసి తాను రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు వైఎస్సార్‌. జిల్లాలో దాదాపు 2.50 లక్షలకు పైగా రైతులు రాజన్న చలువతో రుణవిముక్తులయ్యారు. అప్పో సప్పో చేసి అప్పటికే రుణాలు చెల్లించేసినవారికీ రూ.5 వేల చొ ప్పున ప్రోత్సాహం అందించిందీ ఆయనే. రైతుల రుణాలమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాత్రం. రుణమాఫీ హామీ అమలుకు నానా అగచాట్లూ పడుతోంది. 

గ్రామీణ విద్యార్థులకు కొండంత అండ 
ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్క విద్యార్థీ అర్ధంతరంగా చదువు మానేయకూడదనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తెరపైకి తెచ్చారు వైఎస్‌. అభివృద్ధిలో అట్టడుగున, వలసల్లో ప్రథమ స్థానంలో ఉంటోన్న ఈ జిల్లాలో కొన్ని వేల మంది విద్యాభ్యాసానికి కొండంత అండగా ఆయన నిలిచారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారిలో బీసీ విద్యార్థులే 72 వేల పైచిలుకు ఉన్నారు. 2008 జూన్‌ 25న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాల యం ప్రారంభమైందీ వైఎస్‌ హయాంలోనే అని ప్రతి సిక్కోలు విద్యార్థీ చెబుతారు. 

ఆదర్శంగా ‘ఆరోగ్యశ్రీ’
నిరుపేదలకు సైతం కార్పొరేట్‌ వైద్యం అందించాలనే సంకల్పంతో వైఎస్సార్‌ 2007లో ప్రారంభించిన పథకమే ‘రాజీవ్‌ ఆరోగ్యశ్రీ’. 938 రకాల వ్యాధులకు ఉచిత చికిత్స అందేది. అలాగే ఏ ప్రమాద బాధితులనైనా సరే అత్యవసర సమ యం (గోల్డెన్‌ పీరియడ్‌)లో ఆస్పత్రికి చేర్చితే ప్రాణం నిలబెట్టవచ్చని ఒక వైద్యుడిగా తెలిసిన వైఎస్‌ 108 పేరుతో అంబులెన్స్‌లు ప్రారంభించా రు. గ్రామీణులకు ప్రతినెలా వైద్యం అందించడానికి 104 వాహనాలు అందుబాటులోకి తెచ్చారు. కానీ ఇప్పుడు వాటి పేర్లను, చిత్రాలను మార్చేసిన టీడీపీ ప్రభుత్వం పథకం అమలునూ నీరుగార్చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

సంక్షేమ పథకాల పక్కా అమలు..
ఇక సంక్షేమ పథకాల విషయానికొస్తే ఇందిరమ్మ పథకం మూడు విడతల్లో అన్ని గ్రామాలను సర్వే చేసి జిల్లాలో 2.92 లక్షల మందికి పింఛన్లు, 2.74 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేసి తాను పెద్ద కొడుకునని వైఎస్సార్‌ చెప్పకనే చెప్పారు. ఏదిఏమైనా సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ అందించిన ఏకైక ముఖ్యమంత్రి రాజన్నే అనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. 

అలాంటి రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురావాలనే సంకల్పంతోనే ఆయన కుమారుడు రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రస్తుతం ఉత్తరాంధ్రలో అశేష జనవాహిని మధ్య సాగుతోంది. మరో కొద్దిరోజుల్లో సిక్కోలు గడ్డపై జననేత అడుగుపెడతారని ప్రజలు ఎదురుచూస్తున్నారు.  

డాక్టర్‌ రాజన్న వరమే రిమ్స్‌...
పేదలకు ఆధునిక వైద్యాన్ని, సిక్కోలు విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడానికి శ్రీకాకుళంలో రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజీ (రిమ్స్‌)ను ఏర్పాటు చేసింది వైఎస్సారే. 2008, అక్టోబరు 26వ తేదీన దీన్ని ప్రారంభించారు. అంతేకాదు కొత్త భవనాల నిర్మాణానికి రూ.133 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 13 బ్లాకుల ఈ ప్రాజెక్టులో ఆరు ఆయన హయాంలోనే పూర్తి అయ్యాయి.  

సాగునీటి పథకాలకు పెద్దపీట...
తోటపల్లి ఫేజ్‌–2 ప్రాజెక్టుకు, వంశధార నదిపై తలపెట్టిన రెండో దఫా ప్రాజెక్టుకు, టెక్కలి నియోజకవర్గంలోని ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు జీవం పోసింది నాటి ముఖ్యమంత్రిగా వైఎస్సారే. దాదాపు రూ.970 కోట్ల వ్యయంతో వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2 ప్రాజెక్టును పూర్తిచేస్తే జిల్లాలోని 20 మండలాల్లో 2.55 లక్షల ఎకరాల్లో రెండు పంటలకూ పుష్కలంగా సాగునీరు అందుతుందనే ఉద్దేశంతో 2005లోనే ఈ మహాకార్యానికి సంకల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒడిశాలో వర్షాలు పడితే నాగావళి, వంశధార నదుల్లో కనిపించే వరద ఉద్ధృతికి తట్టుకునేలా రూ.300 కోట్లతో కరకట్టల నిర్మాణానికి బీజం వేసిందీ ఆయనే. మడ్డువలస విస్తరణ ప్రాజెక్టుతో పాటు మహేంద్ర తనయ నదిపై ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకూ సంకల్పించింది వైఎస్‌ రాజశేఖరరెడ్డే. తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు అలాంటి విజన్‌ లోపించడంతో ఇప్పటికీ అవి తుది దశకు చేరుకోలేదంటేనే వాటి చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement