పార్కులో ఏర్పాటు చేసిన గ్రీనరీ
సాక్షి, ప్రొద్దుటూరు : సెలవు రోజుల్లో.. వారాంతంలో పట్టణ ప్రజలు సరదాగా బయటికి వెళ్లి కాసేపు గడపడానికి పరిసర ప్రాంతాల్లో ఒక్క ప్రదేశం కూడా లేదు. పిల్లలతో కలిసి సరదాగా బయటికి వెళ్దామనుకున్న వారికి నిరాశే మిగిలేది. పట్టణంలో మున్సిపల్ పార్కు ఉన్నా అక్కడ సరైన వసతులు లేకపోవడంతో వెళ్లడానికి ప్రజలు పెద్దగా ఇష్టపడరు. ఇవి 2004 ముందు నాటి పరిస్థితులు. ఆ సమయంలో ఎర్రగుంట్ల రోడ్డులోని అటవీ శాఖ స్థలంలో పార్కును ఏర్పాటు చేయాలని కొందరు స్థానికులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
స్థానిక నాయకులు అడిగిన మరుక్షణమే ప్రతిపాదనలు పంపాలని అటవీ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. సాక్షాత్తు సీఎం చెప్పడంతో ఆ ఫైలు వేగంగా కదిలింది. కేవలం రెండు నెలల్లోనే పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 2005 ఆగస్టు 3న వైఎస్ రాజశేఖరరెడ్డి నేషనల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెంటనే రూ.6 కోట్ల నిధులు కేటాయించడంతో పనులు చకచకా ప్రారంభమయ్యాయి. కేవలం ఏడాది తిరక్కుండానే రాజీవ్‌గాంధీ నేషనల్ పార్కు సుందరంగా రూపుదిద్దుకుంది.
238 హెక్టార్లలో పార్కు ఏర్పాటు
ఎర్రగుంట్ల రోడ్డులోని అటవీ శాఖ కార్యాలయం పక్కన ఉన్న దట్టమైన అరణ్యం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో సుందరవనంగా మారింది. పార్కు కోసం సుమారు 238.52 హెక్టార్ల స్థలాన్ని కేటాయించారు. పార్కు చుట్టూ ప్రహరీకి శ్రీకారం చుట్టారు. పరిధి ఎక్కువగా ఉండటంతో పనులు చివరి దశకు చేరుకున్నాయి. అందులో 23.5 హెక్టార్ల స్థలంలో సందర్శకుల కోసం అభివృద్ధి చేశారు. కిడ్స్‌జోన్, వాకర్ ట్రాక్, అక్కడక్కడా కూర్చోడానికి అందమైన షెడ్లు, అరుగులు, పూల మొక్కలు, చెట్లను ఏర్పాటు చేశారు. పార్కులోని జింకలు, కుందేళ్లు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి.
పండుగలు, ఆదివారం, ఇతర సెలవు దినాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి ఉల్లాసంగా గడుపుతారు. ప్రొద్దుటూరుతో పాటు ఎర్రగుంట్ల, రాజుపాళెం, దువ్వూరు మండలాల నుంచి ప్రజలు వస్తుంటారు. విశాలమైన వాకింగ్ ట్రాక్ ఉండటంతో రోజు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తుంటారు. నంగనూరుపల్లె వనసంరక్షణ సమితి ఆధ్వర్యంలో పార్కు నిర్వహణ పనులు జరుగుతున్నాయి. నిరంతరం 8 మంది పార్కులో పని చేస్తుంటారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతోనే పార్కు ఏర్పాటు సాధ్యమైందని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. పార్కులో మరికొంత అభివృద్ధి పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
దట్టమైన చెట్లు ఉండేవి
2005కు ముందు ఈ ప్రాంతం దట్టమైన చెట్లతో నిండి ఉండేది. అయితే వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎం అయ్యాక ఈ ప్రాంతంలో నేషనల్ పార్కును ఏర్పాటు చేశారు. పార్కులో చెట్లు, పూల మొక్కలు, గ్రీనరీ, కిడ్స్ జోన్ ఉన్నాయి. ఆదివారం, పండుగ రోజుల్లో ఎక్కువ మంది వస్తుంటారు.
– మనోహర్, వీఎస్‌ఎస్ సభ్యుడు, నంగనూరుపల్లి
మొదటి నుంచి ఇక్కడే పని చేస్తున్నాను
పార్కు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇందులోనే పని చేస్తున్నాను. చెట్లకు నీరు పోయడం, పెరిగిన మొక్కలను కత్తిరించడం, గ్రీనరీని శుభ్రం చేయడం లాంటి పనులు చేస్తుంటాను. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పార్కుకు భూమి పూజచేయడం నేను చూశాను.
– మరియమ్మ, వీఎస్‌ఎస్ సభ్యురాలు
వైఎస్ చలువతో పార్కు ఏర్పాటైంది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ తీసుకోవడంతోనే ప్రొద్దుటూరులో నేషనల్ పార్కు ఏర్పాటైంది. పట్టణ శివారులో పార్కు ఉండటంతో సెలవు రోజుల్లో పిల్లలతో కలిసి చాలా మంది సరదాగా గడిపేందుకు వెళ్తున్నారు. వాకింగ్ ట్రాక్ కూడా బాగుంది. పార్కును ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
– వెంకటసుబ్బయ్య, ప్రొద్దుటూరు
Comments
Please login to add a commentAdd a comment