
విశాఖ అంటే వైఎస్‌కు ఇష్టం
వైఎస్సార్ సీపీ నేత కొణతాల రామకృష్ణ
అనకాపల్లి , న్యూస్‌లైన్: విశాఖపట్నం అంటే దివంగత మహానేత వై.ఎస్‌కు ఎంతో ప్రీతి అని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ వెల్లడించారు. అనకాపల్లిలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. తండ్రి ఆకాంక్షలకు అనుగుణంగా జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించారన్నారు. ఇందులో భాగంగానే మేనిఫెస్టోలో విశాఖపట్నంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. ఈ ప్రాధాన్యత క్రమంలోనే విజయమ్మ విశాఖలో ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు. ఇది పార్టీ శ్రేణుల్లో జోష్‌ను నింపిందన్నారు.
విశాఖపట్నాన్ని ప్రపంచ ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికను జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించారన్నారు. గ్రీన్‌సిటీగాను, మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. సార్వత్రిక ఎన్నికలలో ప్రజల ఆశీస్సులే వైఎస్సార్ సీపీకి శ్రీరామరక్ష అన్నారు. రాష్ట్ర విభజన సంక్షోభం నుంచి బయటకు వచ్చి సీమాంధ్రను అభివృద్ధి పథంలో నడిపేందుకు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం అవసరమన్నారు.
వైఎస్ కలలను సాకారం చేసి విద్య, ఉద్యోగ, వ్యవసాయ రంగాలలో అభివృద్ధి చేస్తూ సీమాంధ్ర అభ్యున్నతికి శ్రీకారం చుట్టాలంటే విజయమ్మను అత్యధిక మెజారిటీతో గెలుపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు హయాంలో చక్కెర కర్మాగారాలను అమ్మివేసిన సంగతిని గుర్తు చేశారు. నల్లబెల్లం సమస్య దురదృష్టకరమని, పుట్టే పిల్లల రంగును ఎలా చెప్పలేమో బెల్లం రంగును సైతం రైతులు నిర్ణయించలేరన్నారు. గతంలోనూ బెల్లంపై వివిధ రకాల నిషేధాలు కొనసాగాయని, జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన వెంటనే బెల్లం వివాదానికి శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు.