బాధల వేళ బాసటగా..
Published Tue, Oct 29 2013 3:08 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
పై-లీన్ కనికరించిందన్న సంతోషాన్ని నీరుగారుస్తూ అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాలతో పట్టిన ముసురు జిల్లావాసులను కష్టనష్టాల్లో ముంచింది. ఎక్కడ చూసినా నీటిలో కుళ్లుతున్న పైర్లు.. రైతుల కళ్లలో నీళ్లు. నీడనిచ్చే గూళ్లు కూలి, గుండె చెదిరిన నిరుపేదలు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా కొండంత అండగా నిలిచిన మహానేత వైఎస్ వారసత్వానికి కొనసాగింపుగా.. బాధితులకు భరోసానిస్తూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేడు జిల్లాలో పర్యటించనున్నారు.
సాక్షి, కాకినాడ :పుట్టెడు కష్టాల్లో ఉన్న జిల్లావాసుల్లో మనోధైర్యం నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. 10 నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాల్లో సాగే ఆమె పర్యటన కోసం జిల్లా పార్టీ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాలు తోడై వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురిసింది. ఊళ్లూ.. చేలు.. వాగులు.. వంకలు ఒక్కటయ్యాయి. సామాన్యులను కోలుకోలేని దెబ్బ తీశాయి. ముఖ్యంగా రైతులు, చేనేత కార్మికులు.. మత్స్య కారుల పరిస్థితి మరీ దయనీయం. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులకు కనీసం రెండుపూట్ల తిండి కూడా దొరక్క పస్తులతో అలమటించారు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో జిల్లావాసులకు ముఖం చూపలేని కేంద్ర, రాష్ర్ట మంత్రులు వర్షాలను అడ్డం పెట్టుకొని ప్రజల వద్దకు వచ్చి అడుగడుగునా ఛీత్కారాలకు గురయ్యారు.
ఇలాంటి తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బాధితులకు భరోసానివ్వనున్నారు. గతేడాది నవంబర్ 6వ తేదీన నీలం తుపాను విరుచుకు పడ్డ సమయంలో కూడా ఇదే రీతిలో విజయమ్మ జిల్లా అంతా పర్యటించి రైతుల్లో మనోధైర్యం నింపారు. ఎల్లవేళలా మహానేత వైఎస్‌కు అండగా నిలిచిన జిల్లావాసులు ఆయన మరణానంతరం అంతే అభిమానాన్ని ఆయన కుటుంబ ంపై చూపుతున్నారు. ఓదార్పు యాత్ర, హరితయాత్రలతో పాటు ప్రజల పక్షాన జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రతి పోరులోనూ జిల్లావాసులే ఎక్కువగా భాగస్వాములయ్యారు.
దీంతో జిల్లా వాసులకు ఏచిన్న కష్టమొచ్చినా జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోతారు. కోనసీమ రైతుల సాగు సమ్మె, పల్లం అగ్ని ప్రమాద సమయాల్లో ఆయనే అందరి కంటే ముందుగా స్పందించి అండగా నిలిచారు. ఆయనను అక్రమంగా నిర్బంధించిన కాలంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా అదే రీతిలో స్పందించారు. కష్టాల్లో ఉన్నప్రతిసారీ జిల్లాలో పర్యటిస్తూ, జిల్లావాసుల వెన్ను తట్టారు. వారిలో ఎనలేని ధైర్యం నింపారు. అదేరీతిలో ఇప్పుడు వారం రోజుల ముసురుతో కడగండ్ల పాలైన రైతులు, మత్స్యకారులు, చేనేత కార్మికులతో పాటు జిల్లా వాసుల్లో మనోస్థైర్యం పాదుకొలిపేందుకు మళ్లీ జిల్లాలో పర్యటించనున్నారు. విజయమ్మ పర్యటనకు సంబంధించిన వివరాలను జిల్లా పార్టీ కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలియజేశారు.
పర్యటన సాగనుందిలా...
పశ్చిమ గోదావరిలో పర్యటన అనంతరం విజయమ్మ సోమవారం రాత్రి జగ్గంపేట చేరుకుని అక్కడి జెడ్పీ అతిథిగృహంలో బస చేశారు. మంగళవారం ఉదయం జగ్గంపేటలో మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించడంతో జిల్లాలో విజయమ్మ పర్యటన ప్రారంభమవుతుంది. ఆమె కాట్రావులపల్లిలో ముంపునకు గురైన వరి చేలను పరిశీలించి జరిగిన నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకుంటారు. అక్కడ నుంచి అనపర్తి, రామచంద్రపురం, కరప, కాజులూరు, తాళ్లరేవు, కాకినాడ రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో ముంపునకు గురైన చేలు, కాలనీల్లో పర్యటించి కాకినాడ చేరుకుంటారు.
మధ్యాహ్నం కాకినాడ నుంచి బయల్దేరి కాకినాడ రూరల్, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల పరిధిలో పలు చోట్ల పంటపొలాలను పరిశీలిస్తారు. ముంపునకు గురైన కాలనీల్లో పర్యటిస్తారు. అనంతరం కత్తిపూడిలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. అక్కడ నుంచి రావికంపాడు మీదుగా పెరుమాళ్లపురం చేరుకుని పరిసర గ్రామాల్లో ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం తొండంగి మీదుగా అన్నవరం చేరుకుంటారు. అక్కడ నుంచి తుని మీదుగా విశాఖ జిల్లాకు బయల్దేరి వెళ్తారు. జిల్లాలో సుమారు 202 కిలోమీటర్ల మేర విజయమ్మ పర్యటన సాగనుంది.
జగ్గంపేటలో విజయమ్మకు ఘన స్వాగతం
జగ్గంపేట : పశ్చిమ గోదావరి జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటన అనంతరం సోమవారం రాత్రి జగ్గంపేట చేరుకున్న వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు పార్టీ నాయకులు ఘన స్వాగ తం పలికారు. రాత్రికి అక్కడి జిల్లా పరిషత్ అతిథిగృహంలో బస చేసి, మంగళవారం ఉదయం జిల్లా పర్యటనను ప్రారంభిస్తారు. పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, జ్యోతుల నెహ్రూ భార్య మణి, తనయుడు నవీన్, కుమార్తె సునీత, కోడలు దేవి తదితరులు స్వాగతం పలికారు. విజయమ్మ వెంట పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తదితరులు ఉన్నారు. కాగా అంతకు ముందు కడియం మండలం వేమగిరి వద్ద కూడా పార్టీ నాయకులు విజయమ్మకు ఘన స్వాగతం పలికారు.
Advertisement
Advertisement