ఉద్యోగ సంఘాల నాయకుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని పలు ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. రాష్ట్ర మంత్రులుగా ఉంటూ ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను తెలంగాణలో అడుగుపెట్టనీయరాదని జానారెడ్డి ప్రకటించడాన్ని, మంత్రుల ఆదేశాలతో ఆమెను అడ్డుకోవడాన్ని సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సోసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ వెళ్లాలంటే పాస్‌పోర్టు తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెచ్చరించిన విధంగానే ప్రస్తుతం మంత్రులు వ్యవహరిస్తున్నారని ఖజానా శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ వ్యాఖ్యానించారు. శాసనసభ్యులకే రక్షణ లేకపోతే ఇక ఉద్యోగుల పరిస్థితి ఏమిటని నీటిపారుదల ఉద్యోగుల సంఘం, ఎపీఎన్జీవోల సంఘం నగర అధ్యక్షుడు పి.వి.సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.
హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు: లోక్‌సత్తా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు ఇచ్చిన ఆదేశాల మేరకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నట్టు కనిపిస్తోందని లోక్‌సత్తా పార్టీ పేర్కొంది. ఈ మేరకు లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారతీయ పౌరురాలిగా విజయమ్మకు ఉన్న హక్కుల్ని హరించే అధికారం ఎవరీకి లేదని స్పష్టం చేశారు.
అప్రజాస్వామికం: జగ్గారెడ్డి
సంగారెడ్డి, న్యూస్‌లైన్: రైతులను పరామర్శించేందుకు వచ్చిన విజయమ్మను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడాన్ని ఆయన ఖండించారు.
అడ్డుకోవడం దుర్మార్గం: ఉద్యోగ సంఘాల నాయకులు
Published Fri, Nov 1 2013 4:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement