ఏలూరు (టూ టౌన్) : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ గురువారం ఉదయం 10 గంటలకు ఏలూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు, అన్నివర్గాల ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ మొదలైనా రైతులకు బాసటగా నిలిచేందుకు కార్యాచరణ అమలు చేయకపోవడం, వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవడం, రైతులకు రుణాలు అందించే ఏర్పాటు చేయకపోవడం వంటి వైఫల్యాలను నిరసిస్తూ పార్టీ నాయకులు ధర్నాకు పిలుపునిచ్చారు. జిల్లాలో సుమారు 3లక్షల మంది రైతులు 2లక్షల 40వేల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు.
వీరికి ఇప్పటివరకూ సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు రెండు లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, సరపడా ఎరువులను సిద్ధం చేయలేదు. ఏ మండలానికీ పూర్తిస్థాయిలో విత్తనాలు చేరలేదు. మెట్ట ప్రాంతంలో విద్యుత్ అంతరాయంతో బోర్లు ఉన్న రైతులు సైతం దుక్కులు ప్రారంభించలేదు. ఈ సమస్యలపై ప్రభుత్వం కనీస దృష్టి సారించకపోవడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతల అవస్థలను సర్కారు దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ ధర్నా చేపట్టింది.
తరలిరండి : కొత్తపల్లి
ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, అన్నివర్గాల ప్రజలు తరలి రావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆంధ్రా అన్నపూర్ణగా పేరున్న మన జిల్లాలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై పోరాడటానికి అంతా కలసి రావాల న్నారు. సర్కారు తీరుకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపి రైతులకు న్యాయం జరిగేవిధంగా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
మహిళలూ.. తరలిరండి
రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గురువారం నిర్వహించే ధర్నాకు మహిళలు తరలిరావాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
సర్కారు వైఫల్యాలపై రణభేరి
Published Thu, Jun 25 2015 3:03 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement