* ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న చంద్రబాబు
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల కొనుగోలుకు తెరలేపిన తెలుగుదేశం
* హామీలను నెరవేర్చలేమని తెలిసే బాబు కొత్త కుట్రలు
* వైఎస్సార్‌సీపీ గట్టి ప్రతిపక్షంగా ఉంటే నిలదీస్తుందనే భయం
* బలహీనపరచడమే లక్ష్యంగా ఎంపీలతో బేరసారాలు
* ప్రమాణ స్వీకారమైనా చేయకముందే ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై.. టీడీపీకి అనుబంధంగా
* కొనసాగుతానన్న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
* మరికొందరూ చేరుతున్నారంటూ మైండ్‌గేమ్‌కు తెరతీసిన తెలుగుదేశం పార్టీ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో ఖూనీ చేశారు. ప్రజలిచ్చిన తీర్పునే వంచించారు. అధికారంలోకి వచ్చీ రాగానే చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ రాజకీయ దుర్నీతికి, తన మార్కు అక్రమాలకు తెర తీసింది. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ సంతలో పశువుల్లా ప్రజాప్రతినిధుల కొనుగోలుకు బరితెగించింది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో తమదే అధికారమంటూ నేతలను నయానా భయానా ప్రలోభ పెడుతూ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తూ పార్టీలో చేర్చుకునే రాజకీయాలకు తెరతీసింది.
ఈ క్రమంలో... ‘వస్తే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తాం, రాకుంటే ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తాం’ అంటూ బెదిరింపులకు దిగుతోంది! అనర్హత వేటు పడదంటూ చట్టాలకు సైతం వక్రభాష్యం చెబుతూ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తోంది. ముఖ్యంగా ఎడాపెడా ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చలేమని గ్రహించిన బాబు, ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలను మొదలుపెట్టారు. ‘‘సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మొదటగా రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తూ ఫైలుపై తొలి సంతకం చేస్తా. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తా. పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇస్తా’నంటూ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధంగా లేక, వాటినుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే ఒక పథకం ప్రకారం ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించే అజెండాను తెర మీదకు తెచ్చినట్టు తెలుస్తోంది.
హామీల సంగతేమిటని రేపటి రోజున గట్టిగా నిలదీయడానికి సిద్ధమవుతున్న వైఎస్సార్‌సీపీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోళ్లకు దిగుతున్నారు. ఇందుకోసం బాబు స్వయంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి మరీ టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. మరోవైపు బాబు అజెండాను అమలు చేసేందుకు టీడీపీ నేతలు నిస్సిగ్గుగా నడిబజారులోకి వచ్చారు.
సీమాంధ్రలో ప్రజల తీర్పు వెలువడి పది రోజులు కూడా గడవకముందే, ఎన్నికైన సభ్యులు కనీసం ప్రమాణ స్వీకారమైనా చేయకముందే వారిని లోబరుచుకునే చర్యలకు దిగారు. సీమాంధ్రలో గట్టి ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఉండటం సహించలేని బాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు ఒడిగట్టారు. ఏ పదవులు గానీ, ఎన్నికలు గానీ లేని సమయంలో కొందరు నేతలు ప్రజల పక్షాననిలిచి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరితే దాన్ని ‘ఆకర్ష్ పథకం’ అంటూ విమర్శించిన టీడీపీ నేతలు ఇప్పుడు అధికారం తమ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి మరో పార్టీలో చేరితే అనర్హత వేటు ఖాయమని ప్రజాప్రాతినిధ్య చట్టం చాలా స్పష్టంగా చెబుతున్నా, దానికి కూడా టీడీపీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారంటే ఏ స్థాయిలో ప్రలోభాలకు దిగుతున్నారో తెలుస్తోంది. కేంద్రంలో తమదే ప్రభుత్వమని చెప్పుకుంటూ, అనర్హత వేటు లేకుండా చూసుకుంటామనే తప్పుడు వాగ్దానాలతో నేతలను మభ్యపెట్టి మరీ టీడీపీలో చేరాల్సిందిగాఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇది కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం కావడం లేదు! జడ్పీటీసీ, ఎంపీటీసీలకు సైతం స్వయంగా చంద్రబాబు ఫోన్లు చేస్తూ టీడీపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు!!
గట్టి ప్రతిపక్షమంటే బాబుకు భయం
సీమాంధ్ర శాసనసభలో అత్యంత బలమైన ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించడాన్ని టీడీపీ నేతలు ఎంతమాత్రమూ జీర్ణించుకోలేకపోతున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రేపటి రోజున ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగా పట్టుబట్టే అవకాశాలున్నాయని గ్రహించిన టీడీపీ నేతలు ఏదో రకంగా ఆ పార్టీని బలహీన పరచాలన్న చర్యలకు దిగినట్టు స్పష్టమవుతోంది. అందులో భాగంగా... ఢిల్లీలో నరేంద్ర మోడీ నేతృత్వంలో కొలువుదీరనున్న ప్రభుత్వంలో తమ హవాయే సాగనుందంటూ నేతలపై మైండ్ గేమ్ మొదలుపెట్టారు. అనర్హత వేటు పడినా పర్లేదని, ఉప ఎన్నికల్లోనూ ఓడినా మరో పదవి ఇస్తామంటూ టీడీపీ తరఫున రాయబారం నెరుపుతున్న బేరగాళ్లు వైఎస్సార్‌సీపీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు.
ఈ మేరకు బాబు తరఫున ఆయన కోటరీ సభ్యులు వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు నేతల ఇళ్లకు వెళ్లి మరీ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ‘మీకైన ఎన్నికల ఖర్చునంతటినీ చెల్లించడమే గాక ఉప ఎన్నికల ఖర్చు కూడా భరిస్తాం. అదనంగా మంచి ‘ప్యాకేజీలు’ కూడా ఇస్తాం’ అంటూ ఒక ఎమ్మెల్యేపై రెండు రోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు. ‘మీరు వ్యాపార రంగంలో ఉన్నారుగా! వైఎస్సార్‌సీపీలో కొనసాగితే మీకేం ప్రయోజనం? మావైపు రండి. అవసరమైన పనులు చేసి పెడతాం’ అంటూ మరో ఎమ్మెల్యేను ప్రలోభపెడుతున్నారు.
హామీల అమలు అక్కర్లేదా?
బలమైన ప్రతిపక్షముంటే ఎన్నికల హామీలను అమలు చేసేలా పాలక పక్షంపై ఒత్తిడి తెస్తుంది. అవసరమైతే అందుకోసం ప్రభుత్వం మెడలు వంచుతుంది. వైఎస్సార్‌సీపీ నుంచి అలాంటి ఒత్తిళ్ల ప్రమాదం లేకుండా చేసుకోవడానికే టీడీపీ నేతలు ఫిరాయింపు కుట్రలకు తెరతీశారని సర్వత్రా వినిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి ఆదివారం బాబును కలిశారు. తర్వాత నేరుగా పచ్చ కండువా ధరించి, ఆ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. పలు వ్యాపారాలు నిర్వహిస్తూ తాజాగా వైఎస్సార్‌సీపీ తరఫున కర్నూలు ఎంపీగా ఎన్నికైన బుట్టా రేణుక కూడా ఆదివారం బాబును కలిసి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
అయితే వారిద్దరూ కూడా ఏం చెప్పాలో తెలియక, ‘మా నియోజకవర్గ అభివృద్ధిని కోరుకుంటున్నాం. అందుకే టీడీపీలో చేరుతున్నాం’ అన్నారు. కానీ అది సాకు మాత్రమేనని వైఎస్సార్‌సీపీ నేతలంటున్నారు. ‘బాబు నిజంగా అభివృద్ధి చేస్తారని భావించి ఉంటే వారు ఎన్నికలకు ముందే టీడీపీలో చేరి ఉండేవారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు బాబు తన హామీలను నెరవేరుస్తారని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రతిపక్షంలో ఉంటేనే వాటి అమలు కోసం ఒత్తిడి చేయడానికి వీలవుతుంది’ అని గుర్తు చేస్తున్నారు.
పైగాబాబును కలిశాక బుట్టా రేణుక పొంతన లేకుండా మాట్లాడిన తీరు కూడా టీడీపీ కుట్రలను బాహాటంగా బయట పెట్టిందని వారన్నారు. ముందుగా బాబును కలిసి ఎస్పీవై రెడ్డి ఏకంగా తాను టీడీపీలో చేరినట్టు ప్రకటించగా, ఆ తర్వాత కలిసిన రేణుక మాత్రం తడబడ్డారు. టీడీపీలో చేరలేదని, ఆ పార్టీకి అనుబంధ సభ్యురాలిగా ఉంటానని, వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని రకరకాలుగా మాట్లాడారు.
తెర వెనుక...
కేంద్రంలో మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న కడప జిల్లాకు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ వారిని పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారని, టీడీపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. ముగ్గురు ఎంపీలు, మరికొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం మొదలుపెట్టారు. ఆర్థిక ప్రలోభాలను ఎరగా చూపడంతో పాటు ‘రాష్ట్రంలో మా ప్రభుత్వం, కేంద్రంలో మేం భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉంటాయి గనుక మీ వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సంపూర్ణ సహకారం అందిస్తాం. నియోజకవర్గ ప్రజల సంగతి అలా ఉంచి, మీ సొంత ప్రయోజనాలు చూసుకోండి’ అంటూ మైండ్‌గేమ్ మొదలుపెట్టారు. ఈ కోవలోనే వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన ఎస్పీవై, బుట్టా కనీసం లోక్‌సభలో ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే టీడీపీలో చేరినట్టు తెలుస్తోంది.
ప్రజలకు సమాధానం చెప్పాలి: మైసూరా
అధికారంలోకి వచ్చిన పార్టీ తాను ప్రజలికిచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయకుండా, ఇతర పార్టీల్లో గెలిచిన వారిని ప్రలోభపెట్టజూడటం మంచిది కాదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి తప్పుబట్టారు. దీనికి తెలుగుదేశం పార్టీ ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరే హక్కు తమ పార్టీకి ఉందనడం నిస్సందేహమన్నారు. టీడీపీ ఇలాంటి చర్యలకు పాల్పడం సరైంది కాదని చెప్పారు. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్నది కేవలం ఒకవర్గం మీడియా అత్యుత్సాహంతో చేస్తున్న ప్రచారమేనని ఒక ప్రశ్నకు బదులుగాచెప్పారు. ఒకరిద్దరు అలాంటివారు తప్పుగా అలా చేసి ఉండొచ్చుగానీ ఎవరూ పార్టీ వీడరని తెలిపారు.
వేటు ఖాయం
‘‘ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అభ్యర్థి తానున్న పార్టీని వదిలి మరో పార్టీలోకి వెళ్తున్నానని చెప్పినా, ఆ పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినా, పార్టీకి రాజీనామా చేసినా సదరు అభ్యర్థి తానున్న ఆ పార్టీని వదిలేయడమే అవుతుంది. రాజ్యాంగంలోని ఫిరాయింపు నిషేధ చట్టం ప్రకారం ఆ అభ్యర్థికి అనర్హత వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఇదే చెబుతోంది. అయితే ఇక్కడ గుర్తింపు ఉన్న పార్టీయా, లేని పార్టీయా అన్న వివాదాన్ని లేపుతున్నారు.
గుర్తించాల్సిన ముఖ్యమైన విషయమేమంటే... రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో రాజకీయ పార్టీనా, లెజిస్లేచర్ పార్టీనా అన్నారే తప్ప ‘రికగ్నైజ్డ్, నాన్ రికగ్నైజ్డ్’ అన్న విషయాన్ని ప్రస్తావించలేదు. రాజకీయ పార్టీగా నమోదైతే చాలు. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే చాలు. పోటీ చేయడానికి అర్హత ఉన్నప్పుడు, ఆ పార్టీ నుంచి వెళ్లిపోతున్నపుడు అనర్హత ఎందుకు వర్తించదు? ఎన్నికైన పార్టీని వదిలేయడం, మరో పార్టీలోకి చేరడం వల్ల అభ్యర్థికి కచ్చితంగా అనర్హత వర్తిస్తుంది. రికగ్నైజ్డ్ పార్టీ కాదనుకుంటే ఆ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేసినట్టు? ఒక పార్టీ పక్షాన ఎన్నికై మరో పార్టీలో చేరడమనేది అనైతిక, రాజ్యాంగ వ్యతిరేకమైన, దుర్మార్గపు చర్య. ఈ తరహా పోకడలను నివారించడానికే చట్టం చేశారు’’
- మాడభూషి శ్రీధర్, న్యాయ కోవిదుడు
సంతలో బేరం!
Published Mon, May 26 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement
Advertisement