తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్‌తో ప్రారంభింపజేస్తున్న పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైంది. ఉదయం 11.30 గంటలకు ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ చేత రిబ్బన్ కట్ చేయించి నూతన కార్యాలయాన్ని ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా జై జగన్.. వైఎస్సార్ అమర్‌హై అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ పతాకాన్ని ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి చేతుల మీదుగా ముఖ్యమంత్రి దగ్గరుండి ఆవిష్కరింపజేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో తాడేపల్లి ప్రాంతంలో సందడి నెలకొంది. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద రిబ్బన్ కత్తిరింపు తరువాత లోనికి ప్రవేశించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తొలుత తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కొద్దిసేపు పార్టీ కార్యాలయంలోని అన్ని విభాగాలను, అక్కడ జరిగిన ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోని తన చాంబర్‌లో కొద్దిసేపు ఆశీనులయ్యారు. నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పి.అనిల్‌కుమార్‌యాదవ్, అవంతి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్, ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు ముస్తఫా, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, మల్లాది విష్ణు, కిలారు రోశయ్య, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, జి.దేవేందర్‌రెడ్డితో సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
అన్ని హంగులతో కొత్త కార్యాలయం
వైఎస్సార్‌సీపీ తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ కేంద్రంగా పని చేసింది. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల్లో అక్కడి నుంచే కొంతకాలం పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. కొన్నేళ్ల క్రితం విజయవాడ బందరు రోడ్డులో రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో అన్ని హంగులతో కేంద్ర కార్యాలయాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇకపై పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment