
సాక్షి, తాడేపల్లి : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేసిన ప్రజాసంకల్పయాత్ర రాష్ట్ర స్థితిగతిని మార్చివేసిన పాదయాత్ర అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ప్రజల్లో మమేకమై ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నారని గుర్తుచేశారు. ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర ముగిసి నేటికి ఏడాది పూరైన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేష్‌లు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. దేశ చరిత్రలో సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర నిలిచిపోతుంది. ప్రజాసంకల్పయాత్ర రాష్ట్ర స్థితిగతిని మార్చివేసింది. చరిత్రలో నిలిచిపోయే పాదయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్రలో అడుగులో అడుగు వేయడం సంతోషాన్నిచ్చింది. కోట్లాది మంది ప్రజలు వైఎస్ జగన్ మీద నమ్మకం పెట్టుకున్నారు. రికార్డు స్థాయిలో 3648 కి.మీ పాదయాత్ర చేశారు.
మే 23న వైఎస్ జగన్‌పై ప్రజలకు ఎంత అభిమానం ఉందో బయటపడింది. 151 సీట్లలో వైఎస్సార్‌సీపీకి కట్టబెట్టారు. గాలికి వదిలేసిన సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ గాడిలో పెడుతున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన 80 శాతం హామీలను రెండు మూడు నెలల్లోనే అమలు చేశారు. చెప్పని హామీలను కూడా అమలు చేసి చూపిస్తున్నార’ని తెలిపారు.
ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తానని చెబితే అందరు ఆశ్చర్యపోయారని అన్నారు. సుదీర్ఘంగా 3648 కి.మీ సాగిన పాదయాత్రలో ఆయన 2 కోట్ల మందిని కలుసుకున్నారని తెలిపారు. పేదలు పడుతున్న కష్టాలను కళ్లారా చూశారని చెప్పారు. పాదయాత్రలో చూసిన కష్టాలను తీర్చడం కోసం నవరత్నాలను ప్రవేశపెట్టారని.. మొదటి ఆరు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారని వెల్లడించారు. సీఎం జగన్ చారిత్రాత్మక పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు.
నందిగం సురేశ్ మాట్లాడుతూ.. పాదయాత్రను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పండగలా ప్రారంభించారని గుర్తుచేశారు. పాదయాత్ర సమయంలో ఆయనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. కానీ ప్రజల కోసం వైఎస్ జగన్ 3,648 కి.మీ పాదయాత్ర చేశారని తెలిపారు. దళిత కుటుంబంలో పుట్టిన తనను ఎంపీగా చేశారని.. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment