బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం ఇస్తున్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరుడు స్వాములు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భవిష్యత్‌ను కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ఉన్నారని, మాట తప్పని ఆయనే ఆంధ్రప్రదేశ్‌కు సరైన నాయకుడని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ప్రాణం పోయినా మాట తప్పడనే జనాభిమతం తనను ఆయనవైపు ఆకర్షితుడిని చేసిందని చెప్పారు. బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌ని కలిశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులు, సంక్షోభంలోంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడం, తదితర అంశాలపైన వైఎస్ జగన్‌తో చర్చించినట్టు చెప్పారు. త్వరలోనే వైఎస్సార్‌సీపీలో చేరతానని, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని వెల్లడించారు. టీడీపీలో కొనసాగిన కాలంలో రాజకీయ, సామాజిక అంశాలన్నీ బేరీజు వేసుకున్నానని, ఇంకా ఆ పార్టీలో కొనసాగడం సరికాదని తాను, తన అనుచరులు భావించారని అందుకే టీడీపీకి రాజీనామా చేశానన్నారు.
పసుపు–కుంకుమను ఛండాలం చేశారు
తాను పార్టీ మారడానికి అనేక కారణాలున్నాయని ఎమ్మెల్యే ఆమంచి తెలిపారు. పొద్దున లేచిన దగ్గర నుంచి టీడీపీ నేతలు అబద్ధాలే చెబుతున్నారన్నారు. పవిత్రమైన పసుపు–కుంకుమను టీడీపీ ప్రభుత్వం ఛండాలం చేసిందని, పసుపు–కుంకుమను చంద్రబాబు జారుడు బండపై పోశారని, అది అవినీతి మార్గంలో గాలికి కొంత, నేలపై కొంత పోతోందని తీవ్ర విమర్శలు చేశారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబును ఎందుకు మాఫీ చేయలేదని ఎవరూ అడగడం లేదన్నారు. రూ.2 వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కునే ఆలోచన ఆయన చేస్తున్నారని, ఇది దారుణమని అన్నారు.
చంద్రబాబు కులతత్వాన్ని ప్రశ్నించాలనే పార్టీ వీడా
కొన్ని అతీత శక్తులు ముఖ్యమంత్రిని ఆయన నివాసం, కార్యాలయంలో కలుస్తున్నాయని, అవే ఆయన్ను కీలుబొమ్మను చేసి శాసిస్తున్నాయని చెప్పారు. సమాజం గురించి మాట్లాడే తనలాంటి వాళ్లకు, సామాన్యులకు ఏ స్థానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాలను, ఆయనలో ఉన్న నీచమైన కులతత్వాన్ని ప్రశ్నించాలనే టీడీపీని వీడినట్టు వెల్లడించారు. తనలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలోకి వస్తారని తెలిపారు. చంద్రబాబు ‘నిన్న చెప్పింది మర్చిపోండి, ఇప్పుడు చెప్పిందే గుర్తుంచుకోండి’ అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో చంద్రబాబు భాషను గమనిస్తే అవును, కాదనే ఉంటుందన్నారు. దీన్నిబట్టి చూస్తే ఆయనకు పిచ్చిపట్టిందేమో, అల్జీమర్స్ వచ్చిందేమో అనుకోవాల్సి వస్తోందన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ కావాలంటూ 50 మందితో చెప్పిస్తారని, సన్మానాలు చేయిస్తారని మండిపడ్డారు. తన వ్యక్తిగత అవసరాల కోసం, భయంతో హైదరాబాద్‌ను వదిలిపెట్టి పారిపోయి వచ్చాడని దుయ్యబట్టారు. అనుభవం ఉందని అధికారం అప్పగిస్తే ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. అమరావతిలో ఏముందని ప్రశ్నించారు. ఉద్యోగులకు తాగడానికి నీళ్లు, కూర్చోడానికి నాలుగు చెట్లు కూడా లేవని తీవ్ర విమర్శలు చేశారు.
ప్రకాశం జిల్లాలో టీడీపీకి భారీ షాక్
టీడీపీకి ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించారు. చీరాల నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేని కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment