దుకాణాల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు
కోడెల కుటుంబం చెబితేనే ఫైల్ కదులుతోంది
సత్తెనపల్లి సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణ
సత్తెనపల్లి : జిల్లాలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు అవినీతి చెప్పేది కాదని, పర్సంటేజీలు అందలేదని నరసరావుపేట నియోజకవర్గంలో రూ.ఐదు కోట్ల పనులు నిలిపివేయించారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు పాలన అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తోందన్నారు. పట్టణంలో శుక్రవారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులకు నిర్వహించిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
సత్తెనపల్లిలో ప్రత్యేకంగా పృథ్వీ కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్లు ఇల్లు కట్టించి ఇస్తున్నారని, బ్రాంది షాపులు, చౌక దుకాణాల నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా, నీరు చెట్టు పేరుతో మట్టి అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులను, రైతులను డ్వాక్రా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.
రేషన్ షాపులూ అమ్మేస్తున్నారు...
పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ కోడెల, ఆయన కుటుంబ సభ్యులు చెబితేనే ఫైల్ కదిలే పరిస్థితి దాపురించిందన్నారు. రేషన్ షాపులు రూ. లక్ష చొప్పున టీడీపీ వారికే అమ్మే పరిస్థితి నెలకొందన్నారు. మట్టి అమ్ముకోవడానికి, బియ్యం గోనె సంచులు అమ్ముకోవడానికి.. ఇలా ఒక్కొక్క శాఖకు ఒకరిని నియమించారని, వారు కోడెల కుటుంబ సభ్యులకు ఐదు శాతం ఇవ్వాలన్నారు.
పట్టణ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన షేక్ నాగూర్‌మీరాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా నియమితులైన చల్లంచర్ల సాంబశివరావు, పట్టణ యూత్ సెల్ ప్రెసిడెంట్‌గా నియమితులైన అచ్యుత శివప్రసాద్, చీఫ్ విప్ బలిజేపల్లి సురేష్‌కుమార్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొమ్మారెడ్డి చెంచురెడ్డిని ఘనంగా సత్కరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి గార్లపాటి ప్రభాకర్ అధ్యక్షత వహించారు. సభలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి రాము, రాజుపాలెం జెడ్పీటీసీ సభ్యుడు మర్రి వెంకటరామిరెడ్డి, సేవాదళ్, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్లు కొత్తాచినప్పరెడ్డి, సయ్యద్ మహబూబ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి ఓబుల్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కోడిరెక్క దేవదాస్, బెల్లకొండ ఎంపీపీ వెంకటేశ్వరరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
పర్సంటేజీల కోసం కోడెల కక్కుర్తి
Published Sat, May 16 2015 1:32 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement