పోలీసులా ? పచ్చచొక్కాల ఏజెంట్లా ?
నెల్లూరు జిల్లా జడ్పీ కార్యాలయంలో శనివారం జరిగిన సంఘటన టీడీపీ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభివర్ణించారు. ఆదివారం నెల్లూరులో స్థానిక ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లా పరిషత్ ఎన్నికలలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు... ఓ పార్టీకి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. తమ పార్టీ జడ్పీటీసీ సభ్యుడ్ని తమ సమక్షంలోనే టీడీపీ నేతలు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా... పోలీసులు పచ్చ తమ్ముళ్లకు అడ్డుపడకుండా వాళ్లకు సహకరించడం ఎంతవరకూ సబబు అని పోలీసులను ఈ సందర్భంగా కాకాని గోవర్దన్ రెడ్డి ప్రశ్నించారు.
పోలీసులా లేక పచ్చ చొక్కాల ఏజెంట్లా అంటు ఆగ్రహాం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్పై జరిగిన దాడిపై స్పందించాలని రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 13న జరిగే జడ్పీ ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుని నియమించాలని ప్రభుత్వాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.