ఓబీసీలకూ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి  | YSR Congress Party MPs Speeches In Parliament | Sakshi
Sakshi News home page

ఓబీసీలకూ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి 

Published Fri, Dec 13 2019 8:44 AM | Last Updated on Fri, Dec 13 2019 8:46 AM

YSR Congress Party MPs Speeches In Parliament - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/రాజమహేంద్రవరం రూరల్‌/కాకినాడ : చట్టసభల్లో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీపార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. లోక్‌సభ, శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగిస్తూ ప్రతిపాదించిన 126వ రాజ్యాంగ సవరణ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పదేళ్లలో ఎస్సీ, ఎస్టీల పరిస్థితులు మెరుగుపడతాయని రాజ్యాంగ నిర్మాతలు యోచించారు. కానీ 70 ఏళ్లు గడిచినా ఎస్సీ, ఎస్టీల స్థితిగతుల్లో గణనీయమైన మార్పు కనిపించలేదు. దీనికి ఎవరిని నిందించాలి? ఎవరు బాధ్యత వహించాలి? 50 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ దీనికి బాధ్యత వహించాలి.

కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తప్ప ఆ పార్టీ చేసిందేమీ లేదు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల స్థితిగతుల్లో వేగవంతమైన మార్పులు తెస్తుందని ఆశిస్తున్నాను. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26(1) ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంది. ఏపీలో 175 సీట్ల నుంచి 225 సీట్లకు, తెలంగాణలో 119 సీట్ల నుంచి 153 సీట్లకు పెంచాల్సిన అవసరం ఉంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో కూడా ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనిపై నేను ప్రైవేటు మెంబర్‌ బిల్లు కూడా ప్రతిపాదించాను. 2008లో మా ప్రియతమ నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం చేశారు. 2010లో కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2014లో తెలంగాణ అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు చట్టసభల్లో ఇవ్వడంలో తప్పేమీ లేదు..’ అని పేర్కొన్నారు. 

లక్షకు పైగా అధ్యాపక ఉద్యోగాలు ఖాళీ 
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉన్నత విద్యా సంస్థల్లో లక్షకు పైగా అధ్యాపక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ గురువారం రాజ్యసభకు తెలిపారు. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఉన్నత విద్యా సంస్థల్లో మొత్తం 38,459 అధ్యాపక ఉద్యోగాలకు గాను ఈ ఏడాది జూన్‌ నాటికి 13,399 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అధ్యాపక ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందిగా  యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఉన్నత విద్యా సంస్థలకు ఈ ఏడాదిలోనే నాలుగు సార్లు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. 

ఆకాంక్ష జిల్లాల్లో విశాఖ ముందంజ 
ఆంధ్రప్రదేశ్‌లో నీతి ఆయోగ్‌ ఎంపిక చేసిన మూడు ఆకాంక్ష జిల్లాల్లో క్రమేపీ అభివృద్ధి కనిపిస్తున్నట్లు ప్రణాళికా శాఖ సహాయ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్‌తెలిపారు. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రాష్ట్రంలో విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్‌ జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. విశాఖ జిల్లా ఈ ఏడాది జనవరి నాటికి విద్యారంగంలో గణనీయమైన ప్రగతి సాధించి మొదటి స్థానంలో నిలిచినట్లు మంత్రి చెప్పారు. ఈ జిల్లాకు అదనంగా రూ. 3 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. 

‘కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం బిల్లు–2019’కి లోక్‌సభ ఆమోదం 
ఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత్‌ సంస్థాన్, లాల్‌బహదూర్‌శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత్‌ విద్యాపీఠ్, తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత్‌ విద్యాపీఠ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలకు సెంట్రల్‌ యూనివర్సిటీ హోదా కల్పించే ‘కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం బిల్లు–2019’కి గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో సభ  బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వెంకట సత్యవతి మాట్లాడుతూ.. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత్‌ విద్యాపీఠ్‌కు కేంద్ర విశ్వవిద్యాలయం హోదా ఇవ్వాలన్నది ఎన్నో ఏళ్ల డిమాండ్‌ అని, దీన్ని నెరవేరుస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. వేద కాలం నాటి శాస్త్రాలు, అపార జ్ఞానం సంస్కృతంలోనే ఉన్నాయని.. సామన్య ప్రజలకు సంస్కృతంపై అవగాహన కలగాలన్నారు.

విజయవాడ ఎయిర్‌పోర్టు పనుల్లో పురోగతి  
విజయవాడ ఎయిర్‌పోర్టును ప్రైవేటీకరించే ప్రతిపాదనేదీ లేదని, ఈ ఎయిర్‌ పోర్టు పనులు పురోగతిలో ఉన్నాయని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రూ. 500 కోట్ల మేర పనులు పూర్తయ్యాయని వివరించారు.

మూడో తరగతి ఏసీకే ప్రయాణికుల ఆసక్తి  
 రైల్వేలో మూడో తరగతి ఏసీలో ప్రయాణం చేసేందుకే ప్రయాణికులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. డిమాండ్‌ మేరకు త్రీ టైర్‌ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి సమాధానమిచ్చారు. 

జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలి 
గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి కేంద్రాన్ని కోరారు. లోక్‌సభ జీరోఅవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నదీప్రవాహం ఎగువ నుంచి సగటున 1230 టీఎంసీలు రావాల్సి ఉండగా ప్రస్తుతం 456 టీఎంసీలకు పడిపోయిందని, గోదావరిలో మిగులు జలాలు వృధాగా పోతున్నందున ఈ రెండు నదులనూ కలుపుతూ అనుసంధాన ప్రాజెక్టు చేపడితే రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు. 



అన్ని భాషలనూ అభివృద్ధిచేయాలి 
కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. ‘భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనం. దేశంలో భిన్న మతాలూ, భిన్న కులాలే కాకుండా భిన్న భాషలు కూడా ఉన్నాయి. అందువల్ల  అన్ని భాషలనూ అభివృద్ధి చేయాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు. కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం బిల్లు–2019లో తిరుపతి పదాన్ని ఆంగ్లంలో తప్పుగా రాశారని, దాన్ని సరిచేయాలని కోరారు. ఈ బిల్లు భారతదేశంలో తత్వశాస్త్రాన్ని అభివృద్ధి చేయడంలోనూ, యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం వంటివాటి అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా వంగా గీత సంస్కృతంలో చేసిన ప్రసంగాన్ని ప్యానల్‌ స్పీకర్‌గా వ్యవహరించిన భర్తృహరి మెహతాబ్‌ ప్రశంసించారు. సభ మొత్తం వంగా గీత ప్రసంగాన్ని ప్రశంసిస్తోందన్నారు. 

చేనేత కళాకారులకు చేయూతనివ్వండి 
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాంధాని చీరలకు సంబంధించిన పేటెంట్‌ హక్కును కాపాడటంతోపాటు, చేనేత కళాకారులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని ఎంపీ వంగా గీతావిశ్వనా«థ్‌ కేంద్రాన్ని కోరారు. గతంలోనే ఈ చీరలకు పేటెంట్‌ ఉందని ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తన నియోజకవర్గం పరిధిలో కొత్తపల్లి, ఉప్పాడ, కుతుకుడుమిల్లి ప్రాంతాల్లో ఈ చీరల తయారీకి ఎంతో పేరు ఉందన్నారు. జాంధాని పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించడం సంతోషకరమన్నారు. 

ఆర్వోబీలను కేంద్రమే నిర్మించాలి 
రాష్ట్రాల వాటా లేకుండా నేరుగా కేంద్రమే రైల్వే లెవెల్‌క్రాసింగ్‌ల వద్ద ఆర్వోబీలను నిర్మించాలని ఎంపీ వంగా గీతా విశ్వనా«థ్‌ కేంద్రాన్ని కోరారు. దేశ వ్యాప్తంగా 1,182 ముఖ్యప్రాంతాల్లో ఆర్వోబీలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement