
సాక్షి, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ముందుగల గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. మంగళవారం రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కాగానే.. విజయసాయిరెడ్డి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. విపక్షాల నినాదాల హోరుతో పార్లమెంటు ఉభయ సభలూ వాయిదా పడడంతో పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సభలో టీడీపీ ఎంపీలు కనీసం నిరసన కూడా వ్యక్తం చేయడంలేదని, కొందరు సభ్యులు అసలు సమావేశాలకు కూడా హాజరు కావడం లేదని ఆయన మండిపడ్డారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌పీసీ కంటే 5 లక్షల ఓట్లు ఎక్కువ రాబట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈసారి మాత్రం బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరపాలని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. ఈవీఎంలకు ట్యాంపరింగ్ చేయడం బాబుకు బాగా తెలుసనని, ఇప్పుడు ఆయన ఎత్తులు సాగవని తెలిసి ముందే భయపడుతున్నారని అన్నారు. ఏపీలో తుపానుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు మాత్రం ప్రమాణా స్వీకారాల కోసం యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment