
ఇక ప్రజాక్షేత్రంలోకి..
శ్రీకాకుళం అర్బన్: ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన మార్గంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంతోపాటు పార్టీని మరింత పటిష్టపరిచేందుకు కార్యాచరణకు సిద్ధమవుతోంది. దీనిపై చర్చించేందుకు వచ్చే నెల ఆరో తేదీన పార్టీ జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు.
సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన అంతర్గత సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి అందరం సమష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు జరిగిన ఈ సమావేశంలో మొదట ఆమె పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి నిర్దేశించిన మార్గదర్శకా లు, గ్రామస్థాయి సంస్థాగత ఎన్నికలకు సం బంధించిన నివేదికను చదివి వినిపించారు. జిల్లా కమిటీల నిర్మాణం, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ ఎన్నిక, తదితర అంశాలపై చర్చించారు. అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అదే నెల ఆరో తేదీన శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 10గంటలకు జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
ఏడో తేదీ నుంచి జిల్లాలోని 38 మండలాలు, ఆరు మున్సిపాలిటీల్లో పర్యటించి మండల కమిటీలు వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. పార్టీ నిర్ణయం మేరకు రైతు, డ్వాక్రా రుణమాఫీపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా అక్టోబర్ 16న అన్ని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, కంబాల జోగులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు దువ్వాడ శ్రీనివాస్, గొర్లె కిరణ్‌కుమార్, నర్తు రామారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ నేతలు రొక్కం సూర్యప్రకాశ్, మామిడి శ్రీకాంత్, పేరాడ తిలక్, కెవీవీ సత్యనారాయణ, డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, రాజగోపాల్, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.