
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికారం పక్షం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు.. మూడున్నరేళ్ల పాలనలో ఏ మేరకు అమలు చేశారు? ఏ అంశంలో వైఫల్యం చెందారు? అని నేరుగా ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకునేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రచ్చబండ, పల్లెనిద్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకమై సమస్యలు తెలుసుకోవాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు ఆ పార్టీ నేతలు నేటి నుంచి పల్లెబాట పట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలలో ఈ మూడున్నరేళ్ల కాలంలో వీటి అమలు తీరును రచ్చబండలో తెలుసుకోనున్నారు.
ఆయా గ్రామాల్లో రచ్చబండ నిర్వహించి వ్యక్తుల వారీగా రుణమాఫీ ఏ మేరకు అమలైంది? పింఛన్లు అందాయా? అర్హులకు అన్యాయం జరుగుతోందా? ఉపాధిహామీ పథకం పరిస్థితి ఏంటి? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారా? ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో రెండు రూపాయలకే మంచినీళ్లు సరఫరా చేస్తున్నారా? ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సకాలంలో అందుతుందా?.. ఇలా ప్రతి అంశాన్నీ ప్రజలతో చర్చించనున్నారు. అభిప్రాయాలను రికార్డు చేసుకుని వాటిని నియోజకవర్గాల వారీగా క్రోడీకరించి అధిష్టానానికి పంపనున్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే సమస్యల పరిష్కారానికి భరోసా ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 35–40 గ్రామాల్లో చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. 11, 12 తేదీల్లో నియోజకవర్గ సమన్వయకార్తలు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నిద్ర చేయనున్నారు.
ఎన్నికల హామీలతో పాటు.. అసెంబ్లీ హామీలు నెరవేరలేదు
చంద్రబాబునాయుడు 2014 జూన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజధాని ప్రకటన సమయంలో ‘అనంత’ అభివృద్ధికి తనదీ భరోసా అంటూ హామీలు గుప్పించారు. అయితే చంద్రబాబు చెప్పిన హామీలలో ఐదెకరాలున్న వారికే పింఛన్ అనే నిబంధనను, జిల్లాలో మాత్రం పదెకరాలకు సడలించారు. ఇది మినహా తక్కిన ఏ హామీని నెరవేర్చలేకపోయారు. హంద్రీనీవాను పూర్తిచేసి 2015 ఖరీఫ్‌కు నీళ్లిస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ ఊసే కరువయింది. పైగా కుప్పం వరకూ ప్రధాన కాల్వ పూర్తయ్యే వరకూ డిస్ట్రిబ్యూటరీ పనులు చేయొద్దని 2015 ఫిబ్రవరిలో జీఓ 22 జారీ చేసి ‘అనంత’ రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. ‘ అనంత’ను స్మార్ట్‌సిటీ చేస్తామన్నా.. ఇప్పటి దాకా ఎలాంటి ప్రణాళికా రచించలేదు. సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్‌కు అనుబంధ కేంద్రం, టైక్స్‌టైల్ పార్క్, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి సంబంధించి నిధుల కేటాయింపు పక్కన పెడితే భూసేకరణకు కూడా అధికారులు ఉపక్రమించలేదు. ఈ హామీలపై ప్రజలతో చర్చించన్నారు. దీంతో పాటు ప్రత్యేకహాదా, చావశ్యకతపైనా చర్చించనున్నారు. కాలేజీ విద్యార్థులు, యువకులతో కూడా మమేకం కానున్నారు.
ప్రజలే నిర్ణేతలు
చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయింది. ఎన్నికలకు ముందు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీతో పాటు అనేక హామీలు గుప్పించారు. ఒక్కటీ అమలు కాలేదు. పైగా పాలన ఏకపక్షంగా సాగిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతురథం పథకం ద్వారా ట్రాక్టర్లు ఎప్పుడిస్తారో తెలీదు. పైగా టీడీపీ నేతలకు మినహా మరెవ్వరికీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సకాలంలో ఇవ్వలేదు. అతివృష్టి, అనావృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తితే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. ప్రజలను మోసం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో వైఫల్యం చెందింది. అందుకే ప్రజల ముందుకు వెళుతున్నాం.
– అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు
ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి
రచ్చబండ, పల్లెనిద్రను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తాం. ప్రజలు చెప్పిన సమస్యలను నమోదు చేసుకుని నియోజకవర్గాల వారీగా క్రోడీకరిస్తాం. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతాం. సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాడతాం. ఎన్నికల హామీలతో పాటు అసెంబ్లీలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదాపైనా చర్చిస్తాం. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పల్లె నిద్ర చేసి వారి సమస్యలనూ స్వయంగా తెలుసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలి.
– శంకర్‌నారాయణ, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment