రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేం సవాల్ విసురుతున్నాం. నీకు దమ్ము, ధైర్యముంటే మీరు కొనుగోలు చేసిన....
వైఎస్సార్‌సీపీ నేతల సవాల్
కదిరి : ‘రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేం సవాల్ విసురుతున్నాం. నీకు దమ్ము, ధైర్యముంటే మీరు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మళ్లీ వారిని గెలిపించుకునే సత్తా మీకు ఉందా? ఉంటే ఎన్నికలకు సిద్ధమా?..’ అని వైఎస్సార్‌సీపీ నేతలు సవాల్ విసిరారు. శనివారం కదిరిలో జీవిమాను కూడలిలో వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు ఆ పార్టీ నాయకులు మాట్లాడారు.
ధర్నాలు చంద్రబాబు ఇంటి ముందు చే యండి
ప్రజా సమస్యలు పరిష్కరించని చంద్రబాబును ఇంకేమనాలి? ప్రజల్ని మోసగించారని హారతులు పట్టాలా?. ఆయన అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చారు. టీడీపీ నేతలు ధర్నాలు చేస్తుంటే నవ్వొస్తోంది. ఆ ధర్నాలేంటో మీ ‘బాబు’ ఇంటి ముందు చేయండి. - రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి
ప్రతిపక్షమంటే బాబుకు దడ
ఎన్నికలకు మునుపు ఎన్నో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన మీరు ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ప్రతిపక్షమంటే చంద్రబాబుకు దడ. అందుకు మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మేము మాట్లాడుతుంటే ఆయన తన మంత్రులు, ఎమ్మెల్యేలతో మాపైనా, మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపైనా బండబూతులు తిట్టించిన విషయం అప్పుడే మరిచిపోతే ఎలా ? - ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి
నిత్యం ప్రజల మధ్యే జగన్
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తమ పార్టీ అధినేత జగన్ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని రాయచోటి ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతి ఇంటి తలుపుతట్టాయని, మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలన్నారు. ఎన్‌పీ కుంటలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వడంలో ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. - రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రె డ్డి
చంద్రబాబుకు ఆడోళ్ల ఉసురు తగులుతుంది
తాను అధికారంలోకి రాగానే మహిళల డ్వాక్రా రుణాలు మాఫీ చెప్పి మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మా ఆడవాళ్ల ఉసురు తగులుతుంది. బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు.- కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్
వైఎస్ పాలన సువర్ణయుగం
వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజలకు ఏ కష్టం రాలేదు. ఆయన పాలన సువర్ణయుగంలా సాగింది. చంద్రబాబు పాలన ఎలా ఉందో చెప్పనక్కరలేదు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చారు..అవే ఆయన కొంప ముంచడం ఖాయం. - పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి