నేటి నుంచి పింఛన్ల పండగ | YSR Pension Gift Distributed By Late YS Rajasekhara Reddy Jayanthi On July 8 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పింఛన్ల పండగ

Published Mon, Jul 8 2019 10:05 AM | Last Updated on Mon, Jul 8 2019 10:05 AM

YSR Pension Gift  Distributed By Late YS Rajasekhara Reddy Jayanthi On July 8 - Sakshi

సాక్షి, కాకినాడ,(తూర్పుగోదావరి) : రాజన్న సంక్షేమ రాజ్యాన్ని తలపిస్తూ, పాలన సాగిస్తున్న వైఎస్సార్‌ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెంచిన సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు అందజేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్లను ఈ నెలలో సోమవారం నుంచి అందించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 నుంచి, పెంచిన మొత్తం కలిపి ‘వైఎస్సార్‌ పింఛను కానుక’ పేరుతో లబ్ధిదారులకు రూ.2,250 చొప్పున అందించనున్నారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పెంచిన పింఛన్లను అందజేయనున్నారు.

12 కేటగిరీలుగా..
‘వైఎస్సార్‌ పింఛన్‌ కానుక’లో 12 కేటగిరీలు ఉన్నాయి. వీటిలో హిజ్రాలు, డప్పు కార్మికులకు గతంలో మాదిరిగానే నెలకు రూ.3 వేల చొప్పున ఇవ్వనున్నారు. దివ్యాంగులకు గతంలో రెండు రకాల పింఛన్లు ఇచ్చేవారు. 80 శాతం పైగా వైకల్యం ఉన్నవారికి రూ.3 వేలు, అంతకులోపు వారికి రూ.2 వేల చొప్పున ఇచ్చేవారు. ప్రస్తుతం దీంతో సంబంధం లేకుండా దివ్యాంగులందరికీ రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అభయహస్తం పింఛన్ల కింద రూ.500 మాత్రమే ఇవ్వనున్నారు. దీనిని కూడా రూ.2,250కి పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినా ఈ నెలకు మాత్రం రూ.500 చొప్పునే ఇస్తారు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ)కు ఉత్తర్వులు జారీ చేశారు.

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, హెచ్‌ఐవీ బాధితులు, చర్మకారులకు రూ.2,250 చొప్పున ఇవ్వనున్నారు. డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తారు. అన్ని కేటగిరీలూ కలిపి జిల్లావ్యాప్తంగా మొత్తం 5,81,033 మంది లబ్ధిదారులు ఉండగా.. వీరికోసం తాజాగా పెంచిన మొత్తం కలిపి ప్రభుత్వం రూ.139.97 కోట్లు విడుదల చేసింది. ఎనిమిది కేటగిరీలకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.2,250 చొప్పున ఇస్తారు. ఇలా వృద్ధులు, చేనేత, ఒంటరి మహిళ, వితంతువులు, గీతకార్మికులు, మత్స్యకార్మికులు, చర్మకారులు, హెచ్‌ఐవీ బాధితులకు పంపిణీ చేస్తారు. డప్పు కార్మికులు, హిజ్రాలకు పెరగదు. వీరికి ఇప్పటికే రూ.3 వేలు ఇస్తున్నారు. డయాలసిస్‌ రోగులకు రూ.ఏకంగా రూ.3,500 నుంచి రూ.10 వేలకు పెరిగింది.

అర్హత వయస్సు తగ్గింపు
సామాజిక పింఛనుకు 65 ఏళ్లు నిండాలనే నిబంధన ఉండేది. దీనిని 60కి తగ్గిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పింఛన్లకు మరో 84 వేల మంది అర్హులు ఉన్నట్లు సాధికార సర్వేలో వెల్లడైంది. ఇందులో 60 ఏళ్లు ఉన్నవారు సుమారు 24 వేల మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి కూడా త్వరలో పింఛన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

కొత్త పింఛన్‌ పుస్తకాల సరఫరా
వైఎస్సార్‌ పింఛన్‌ కానుకకు సంబంధించి జిల్లాకు కొత్త పుస్తకాలు సరఫరా అయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు అందజేసిన పుస్తకాల స్థానంలో కొత్తవాటిని లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ప్రతి నెలా పంపిణీ చేసిన పింఛను వివరాలను ఈ పుస్తకాల్లో నమోదు చేస్తారు.

పండగ వాతావరణంలో..
జిల్లావ్యాప్తంగా ‘వైఎస్సార్‌ పింఛన్‌ కానుక’ పంపిణీ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. లబ్ధిదారుల జాబితాలను అన్ని పంచాయతీ కార్యాలయాల్లోనూ ప్రచురించాలని ఆదేశించాం. సోమవారం నుంచి పింఛన్లు మూడు రోజుల పాటు పంపిణీ చేస్తాం.
– ఎన్‌.మధుసూదనరావు, డీఆర్‌డీఏ పీడీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement