సాక్షి, విజయవాడ: 'మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు' అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విచక్షణ కోల్పోయి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దళితుల్ని ఎమ్మెల్యే అసభ్యపదజాలంతో దూషించిన వీడియాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. టీడీపీ హయాంలో దళితులను అడుగడుగునా కించపరుస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతమనేని వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ, దళిత సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పలు చోట్ల చింతమనేని దిష్టి బొమ్మలను ఆందోళనకారులు దగ్ధం చేశారు. చింతమనేని వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని, అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు)
టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కాలే పుల్లారావు, పల్లి విజయ రాజు, చందా కిరణ్ తేజ, లెలపుడి లాజరు, పోలిమెట్ల శరత్, పార్టీ కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (‘సాక్షి’ కథనంపై చింతమనేని ఆగ్రహం)
ఇక మరో కార్యక్రమంలో దళితులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అధ్వర్యంలో దళితసంఘాల నాయకులు అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, తుమ్మల ప్రభాకర్, మర్కపుడి గాంధీ, మాతంగి వెంకటేశ్వర్లు, పగిదిపల్లి సునీల్, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే అరెస్టు చేయాలని జగ్గయ్యపేటలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment