అమృతలూరు: ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరుతో సీఎం చంద్రబాబు మరో కొత్త డ్రామాకు తెర తీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున ఆరోపించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారం చేపట్టిన 23 నెలల్లో రాష్ట్రంలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదని విమర్శించారు.
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో రూ.16,300 కోట్ల ఖర్చుతో ఆరు లక్షల ఇళ్లు నిర్మాస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2016 -17 బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.132 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. వచ్చే ఏడాది మరో రెండు వేల కోట్లు కేటాయించినా ఈ పథకాన్ని పూర్తి చేయడం కష్టమన్నారు.
కౌలు రైతుల పని అగమ్యగోచరం...
టీడీపీ ప్రభుత్వంలో కౌలు రైతులకు రుణాలు అందక వారి పరిస్థితి అగమ్యచోచరంగా తయారైందని అన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది కౌలు రైతులేనని, ఎలాంటి హామీ లేకుండానే రుణాలిస్తామని చెప్పిన ప్రభుత్వం రుణ అర్హత పత్రాలిచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. వాటికి బ్యాంకులు రుణాలివ్వడంలేదన్నారు. కౌలు రైతుల పరిరక్షణకు 2011లో భూ అధీకృత సాగుదారుల చట్టం అమల్లోకి వచ్చిందని కౌలు రైతులను ఆదుకునేందుకు రెవెన్యూ వ్యవసాయ శాఖ, బ్యాంకర్ల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి రుణార్హత పత్రాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి రాయితీని రుణ అర్హత కార్డు ద్వారా అందుకోవచ్చునని చెబుతున్నారే తప్ప ఎక్కడా ఆచరణలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు.