అసెంబ్లీ సమావేశాల్లో గొంతు విప్పిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
హుద్‌హుద్‌సాయం పంపిణీలో వివక్షపై నిలదీత
ఆదుకోవడంలో పాలకుల వైఫల్యంపై విరుచుకుపడ్డ నేతలు
విశాఖపట్నం: ప్రభుత్వాన్ని నిలదీస్తూ..ప్రజల పక్షాన పోరాడుతూ వైఎస్సార్‌సీపీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడులు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో గొంతు విప్పారు. హుద్‌హుద్ తుఫాన్‌కు జిల్లాలో ప్రజానీకం అతలాకుతలమైతే నామమాత్రపు చర్యలతో అందరినీ ఆదుకున్నామని తప్పుడు ప్రకటనలు చేయడం సరి కాదని అధికార పక్షాన్ని కడిగిపాడేశారు. తుఫాన్ సాయం పంపిణీలో వివక్ష చూపారని, టీడీపీ వారికే అందేలా వ్యవహరించారంటూ నిలదీశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా తుఫాన్ బాధితులందరికీ నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రాణాలు పోయినా కనికరించరా?
పాడేరు నియోజకవర్గంలో నలుగురు గిరిజనులు హుదూద్‌కు నలుగురు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వానికి కనిపించలేదా?అని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అసెంబ్లీలో ప్రశ్నించారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుదూద్ తుఫానుతో గిరిజనులకు అన్ని విధాల తీవ్ర నష్టం వాటిల్లినా ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహించిందని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. విలువైన కాఫీ తోటలు ధ్వంసమైనా మొక్కుబడిగానే ప్రభుత్వం స్పందించిందని పూర్తిస్థాయిలో పరిహారం కూడా పంపిణీ చేయకపోవడం దారుణమంటు మండిపడ్డారు. గిరిజనులపై ప్రభుత్వం వివక్ష చూపడం తగదన్నారు.
గిరిజనులంటే చులకనా?
తుఫాన్ ముగిసిన నాలుగు రోజుల వరకూ గిరిజనులు చచ్చారో బతికారో చూడ్డానికి కూడా ఒక్క అధికారిగానీ, పాలకులు గానీ అరకు నియోజకవర్గానికి ఎందుకు రాలేదని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అసెంబ్లీలో ప్రశ్నించారు. నాలుగు రోజుల తర్వాత ఆహార పొట్లాలు అందించామంటున్న ప్రభుత్వం ఆ నాలుగు రోజులు గిరిజనులు ఏం తిని బతికారో చూశారా అని నిలదీశారు. గిరిజనులను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని పాలకపక్షాన్ని దుయ్యబట్టారు. గిరిజనులను కనీసం పలకరించే తీరిక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేకపోవడం విచారకరమని, కేవలం జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే రాత్రి వేళలో సైతం వచ్చి బాధితుల కన్నీరు తుడిచారని గుర్తుచేశారు.
పరిహారం ఎవరికిచ్చారు?
తుఫాన్ వల్ల నిజంగా నష్టపోయిన వారిని పరిహారం జాబితాలో చేర్చకుండా, కనీసం నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికి కూడా రాకుండా ఎవరికి పరిహారం అందించారో చెప్పాలని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. తన నియోజకవర్గంతో పాటు జిల్లాలో తుఫాన్ వల్ల చనిపోయిన మూగజీవాలు, కూలిపోయిన పశువుల పాకలను నష్టపరిహారం జాబితాలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. కేవలం టీడీపీ కార్యకర్తలు, నేతలు సూచించిన వారి పేర్లు రాసుకుని అధికారులు వెళ్లిపోయారని, పాడైన పంటలను చూడ కుండా అధికారులు చేసిన సర్వే అస్తవ్యస్తంగా జరిగిందని దీని వల్ల బాధితులకు ఒరిగిందేమీ లేదంటూ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.
ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ప్రజల పక్షాన పోరాడుతూ..
Published Mon, Dec 22 2014 12:48 AM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM
Advertisement
Advertisement