జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు
సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు
స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన ప్రజలు
అధికారమే పరమావధిగా ఎన్నో వాగ్దానాలు చేశారు. అవన్నీ తీరుతాయన్న ఆశతో జనం ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. రెండేళ్లయింది. ఆ హామీలు అమలు చేయలేదు. ఆయన్ను నమ్మిన జనం తీవ్రంగా నష్టపోయారు. అందుకే వారి తరఫున వైఎస్సార్‌సీపీ రంగంలోకి దిగింది. దగా చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన స్పందన కనిపించింది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అధికారంకోసం అడ్డమైన హామీలిచ్చి... ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లయినా వాటిని తీర్చలేదని, జనాన్ని మోసగించారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ర్యాలీగా వెళ్లి, పోలీసు స్టేషన్ల ఎదుట కాసేపు నిరసన తెలియజేసి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఫిర్యాదులు చేశారు. బొబ్బిలిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఒకసారి ఎవర్నైనా మోసం చేస్తే మోసగాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, రెండేళ్లల్లో ప్రతీ రోజూ ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏమనాలని ప్రశ్నించారు.
ప్రజాగ్రహానికి చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ప్రజలను మోసగించినందుకు చంద్రబాబుపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తోపాటు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, కార్యదర్శి డోల బాబ్జీ, తూముల రాంసుదీర్, మర్రాపు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
చీపురుపల్లిలో...
పార్టీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)ల నాయకత్వంలో చీపురుపల్లిలో భారీ ప్రదర్శనగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. అంతకుముందు మండల పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు అధ్యక్షతన గాంధీబొమ్మ జంక్షన్ వద్ద సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్‌ఐ కాంతికుమార్‌కు ఫిర్యాదు అందజేశారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బెల్లాన రవి, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్.వి.రమణరాజు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంలో...
విజయనగరంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆశపువేణఫు ఆధ్వర్యంలో కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి సీఎం చంద్రబాబు మోసాలపై విజయనగరం వన్‌టౌన్‌పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని సీఐ వెంకటఅప్పారావుని కోరారు. అంతకుముందు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా చేరుకుని అక్కడ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా యువజన విభాగం ప్రతినిధి బోడసింగి ఈశ్వరరావు, సీనియర్ కౌన్సిలర్ ఎస్.వి.వి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
గజపతినగరంలో...
గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా వెళ్లి అక్కడి ఎస్‌ఐకు చంద్రబాబు మోసాలపై ఫిర్యాదు చేశారు. తక్షణమే బాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్లలో...
ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి రాష్ట్రప్రజలను మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పి.వి.వి.సూర్యనారాయణరాజు(డాక్టర్ సురేష్‌బాబు) డిమాండ్‌చేశారు. నెల్లిమర్ల పోలీసుస్టేషన్లో బుధవారం చంద్రబాబుపై ఫిర్యాదుచేశారు. పార్టీ రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు సింగుబాబు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ , పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్.కోటలో ర్యాలీకి అనుమతి నో
శృంగవరపుకోటలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ర్యాలీకి పోలీసులు అడ్డు చెప్పారు. దీంతో పార్టీ సమన్వయకర్త నెక్కల నాయుడుబాబు ఆధ్వర్యంలో సుబ్బరామిరెడ్డి కల్యాణమండపంలో సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పార్వతీపురంలో బైక్‌ర్యాలీ
పార్వతీపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి, పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై బి.సురేంద్రనాయుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై 420 కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గర్భాపు ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.
మీరు తిడితే తిట్లు కావా?: పీడిక రాజన్నదొర
రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలిచ్చి, ఓట్లేయించుకుని, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండానే చేసేసినట్టు ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేయాలని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అక్కడి పట్టణ పోలీసులకు పిర్యాదు చేశారు. బుధవారం అఫీషియల్ కాలనీలోని ఆయన ఇంటి నుండి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలసి ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ జి.రామకృష్ణ, ఎస్‌ఐ పి.రామకృష్ణకు ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ అసెంబ్లీలోపల, బయట ప్రతిపక్ష నేత జగన్‌పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన టీడీపీ నాయకులు తాము తిడితే తిట్లు కావని, ప్రతిపక్ష నేతలు మాట్లాడితే ఘోరంగా భావిస్తున్నారన్నారు.
పోలీస్‌స్టేషన్లలో సీఎం చంద్రబాబుపై ఫిర్యాదులు
Published Thu, Jun 9 2016 12:42 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement