సాక్షి, అమరావతి: తనను విధుల నుంచి రిలీవ్ చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయకుండా కర్నూలు డీఐజీ తప్పించుకుని తిరుగుతున్నారని హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న అధికారి తనను రిలీవ్ చేయకుండా ఉద్దేశ పూర్వకంగా తప్పించుకుని తిరగడం సిగ్గుచేటని విమర్శించారు. రాజకీయాల్లో చేరే క్రమంలో 2018, డిసెంబరు 30న గోరంట్ల మాధవ్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితమే వీఆర్‌ఎస్‌కి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయనకు నామినేషన్ విషయంలో అడ్డంకులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తక్షణమే మాధవ్ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. (మా నాన్న అప్పుడే హెచ్చరించారు : గోరంట్ల)
అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిపి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపును సునాయాసం చేసేందుకే తనను రీలీవ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, పోలీస్ అధికారులే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయడం దుర్మర్గమన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు డైరెక్టన్‌లో డీఐజీ పని చేస్తున్నారని మాధవ్ ఆరోపించారు. ఐపీఎస్ అధికారులు రాజకీయ పార్టీల కోసం పనిచేయకూడదని, డీజీ, కర్నూలు డీఐజీ తీరును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుకెళ్లినట్లు మాధవ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment